ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మంగళవారం వికారాబాద్ జిల్లాలోని పెద్దేముల్, కొడంగల్ మండలాల్లోని పలు గ్రామాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, షాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భాజాభజంత్రీలతో బోనాలను ఊరేగించగా, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
చిన్నాపెద్ద నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. అనంతరం అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు తీర్చుకున్న భక్తులు ఊరు, వాడలను సల్లంగ సూడు తల్లీ అని వేడుకున్నారు. ఈ బోనాల ఉత్సవాల్లో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని గ్రామ దేవతలకు పూజలు చేశారు.
షాబాద్, జూలై 26: షాబాద్ మండలంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని కుమ్మరిగూడ, షాబాద్ తదితర గ్రామాల్లో మైసమ్మ, ఎల్లమ్మ బోనాల ఉత్సవాలను అంగరంగా వైభవంగా నిర్వహించారు.
ఉదయం నుంచి భక్తులంతా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం గ్రామాల్లో బోనాల ఊరేగింపు చేపట్టారు. కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ జడల లక్ష్మి రాజేం దర్‌గౌడ్, సర్పంచులు తమ్మలి సుబ్రమణ్యేశ్వరి, పొనమోని కేతన, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీలు ఆశోక్, అరుణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
పెద్దేముల్, జులై 26: ఊరు వాడ సల్లంగా ఉండేలా సూడు తల్లి అంటూ నాగులపల్లి గ్రామస్తులు గ్రామ దేవత పోచమ్మకు బోనాలు సమర్పించారు. పోచమ్మ ఆలయం చు ట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలను, నైవేద్యాలను సమర్పించారు. పాడి పంటలు బాగా పండి ఊరు వాడ సల్లంగా ఉండేలా చూడాలని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమంలో సర్పంచ్ మట్ట భాగ్య లక్ష్మీ, ఎంపీటీసీ సురేఖ,ఉపసర్పంచ్ మల్రెడ్డి, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.
మొయినాబాద్, జూలై 26: మొయినాబాద్‌లోని ముర్తుజాగూడ, ఎల్కగూడ గ్రామాల్లో బోనాల ఉత్సవాలు నిర్వహించారు. పోతరాజుల విన్యాసం, శివసత్తుల పూనకాల, బ్యాండ్ మేళాలు, డీజే హోరులో బోనాల ఉత్సవాలు నిర్వహించారు.
కొడంగల్, జూలై 26: కొడంగల్ మండలంలోని అన్నారం, ఇందనూర్ గ్రామాల్లో ఘ నంగా బోనాలు నిర్వహించారు.ఊరేగింపు నిర్వహించి ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాల ఉత్సవంతో గ్రామాల్లో పండుగ వాతావణం నెలకొంది.