కడ్తాల్, అక్టోబర్ 28 : పాడిపరిశ్రమాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మండల పశువైద్యాధికారి భానునాయక్, పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్ రాధిక అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని విజయ పాల సేకరణ కేంద్రం ఆవరణలో, విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం, పశుసంవర్ధక శాఖ, స్కైఈసీ డ్రగ్స్ సంయుక్త ఆధ్వర్యంలో పశు పోషణపై పాడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ డెయిరీ సొసైటీ చైర్మన్ వెంకటేశ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అధికారులు మాట్లాడారు. పశు వైద్యాధికారి భానునాయక్ మాట్లాడుతూ పాడి రైతులు పశు పోషణలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
పశువులు అనారోగ్యానికి గురైతే వెంటనే పశువైద్యుడికి తెలియజేయాలని సూచించారు. పశువులకు వచ్చే చర్మ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆవులు, బర్రెలకు విధిగా బీమా చేయించుకోవాలని సూచించారు. పాల ఉత్పత్తిని పెంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ఆయన వివరించారు. పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్ రాధిక మాట్లాడుతూ పాడి రైతులు తమ పాలను విజయ డెయిరీలో పోసి మంచి ఆదాయాన్ని ఆర్జించాలన్నారు. పాడి రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం లీటరుకి రూ.4 ప్రోత్సాహక ధరను అందజేస్తున్నదని పేర్కొన్నారు.
అనంతరం పాడి రైతులకు రూ.20 వేల విలువ గల డీవార్మింగ్ బోలస్, పాల ఉత్పత్తి టానిక్స్, లిక్విడ్లను పాడి రైతులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్, సొసైటీ చైర్మన్ వెంకటేశ్, వైస్ చైర్మన్ రాములుయాదవ్, డైరెక్టర్లు మహేశ్, కుమార్, జగన్, వార్డు సభ్యులు భిక్షపతి, జంగమ్మ, పాడి రైతులు జంగారెడ్డి, రఘుమారెడ్డి, దామోదర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, యాదయ్య, వెంకట్‌రెడ్డి, పెంటయ్య, వెంకట్రాములుగౌడ్, జంగయ్యగౌడ్, రవీందర్‌రెడ్డి, లక్ష్మణ్‌చారి, జగన్యాదవ్, చంద్రయ్య, రాములు, బాల్‌రాజ్ పాల్గొన్నారు.