మొయినాబాద్ : పశువులకు కృత్రిమ గర్భాదారణతోనే 90శాతం ఆడదూడలు పుట్టేలా చమన్ (వీర్య కణాలు)ను అభివృద్ధి చేయాలని తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ మంజులవాణి అన్నారు. మొయినాబాద్ మండల కేంద్రంతో పాటు చిలుకూరు బాలాజీ దేవాలయం గోషాలను ఆమె సందర్శించి కృత్రిమ గర్భం ద్వారా పుట్టిన దూడలను పరిశీలించారు. కృత్రిమ గర్భం దాల్చడం వల్ల ఎలాంటి అభివృద్ధి ఉందనే విషయాలను తెలుసుకున్నారు. గోపాల మిత్రలు చేస్తున్న కృత్రిమ గర్భాదారణ వల్ల దూడలు ఎలా పుడుతన్నాయని.. పుట్టిన దూడలు ఆరోగ్యంగా ఉంటున్నాయా.. లేదా పాల ఉత్పత్తి ఎలా ఉంది అనే విషయాలను స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం చాలా వరకు పశువులకు కృత్రిమ గర్భదారణే చేస్తున్నారు కాబట్టి గర్భం సమయంలో ఆడదూడలు పుట్టేలా చమన్ ఇస్తే పశువుల సంతతి పెరిగి పాడి అభివృద్ధి పెరుగుతుందన్నారు. అందుకోసం 90శాతం ఆడదూడలు పుట్టే విధంగా చమన్‌ను అభివృద్ధి చేయాలన్నారు. ఆమె వెంట వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రావాణ్కుమార్, జయాదేవి, దేవేందర్, మండల పశువైద్యాధికారి శ్రీలత, గోపాల మిత్రలు శ్రీనివాస్, యాదయ్య, బాలకృష్ణ సిబ్బంది ఉన్నారు.