ఇబ్రహీంపట్నం, జూన్ 7 : ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఇబ్రహీంపట్నం డివిజన్లో ముమ్మరంగా సాగుతున్నది. పట్టణాలు, గ్రామాల్లో ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో సుమారు 180 వరకు ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలలన్నింటిలోనూ బడిబాట కార్యక్రమం చేపట్టారు. మన ఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు మరమ్మతులు చేసి అన్ని వసతులు కల్పించారు. మంగళవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లోని అన్ని వార్డులు, గ్రామాల్లో ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి..
ఇబ్రహీంపట్నంరూరల్ : గ్రామంలోని ప్రతి విద్యార్థినీ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించాలని పోల్కంపల్లి సర్పంచ్ ఆండాళు, ఎంపీటీసీ చెరుకూరి మంగ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రతి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిరణ్‌కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి
కడ్తాల్ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మక్తమాదారం సర్పంచ్ సులోచన, ఎంపీటీసీ మంజుల అన్నారు. మండల పరిధిలోని మక్తమాదారం గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి వారు ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ నర్సింహాగౌడ్, ఎస్ఎంసీ చైర్మన్ ధన్‌రాజ్, నాయకులు సాయిలు, చంద్రమౌళి, మహేందర్‌గౌడ్, పాఠశాల సిబ్బంది రమేశ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
చేగూరులో బడి బాట కార్యక్రమం..
నందిగామ :చేగూరులో మంగళవారం ఐసీడీఎస్ సూర్‌వైజర్ జ్యోతి ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. చిన్న పిల్లలను అంగన్వాడీలకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
చింతకుంటపల్లిలో..
కేశంపేట : చింతకుంటపల్లిలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ పార్వతమ్మ, ఉపాధ్యాయులు గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం సుచరిత, ఉపాధ్యాయులు వీరయ్య, పంచాయతీ కార్యదర్శి శేఖర్, గ్రామ పత్యేకాధికారి మాసయ్య పాల్గొన్నారు.