యాచారం, ఏప్రిల్ 23 :మండలంలోని అయ్యవారిగూడ గ్రామం ఒకప్పుడు పక్క గ్రామమైన నందివనపర్తికి అనుబంధంగా ఉండేది. మేజర్ గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామం ఉండటంతో అయ్యవారిగూడ గ్రామం అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉండేది. నందివనపర్తి గ్రామ పంచాయతికి అయ్యవారిగూడతోపాటుగా బొల్లిగుట్టతండా, ఏనెకిందితండా, కొమ్మోనిబాయి, పిల్లిపల్లి గ్రామా లు అనుబంధంగా ఉన్నాయి. నిధుల అమలులో అనుబంధ గ్రామాలకు చుక్కెదురు తప్పలేదు. దీంతో అనుబంధ గ్రామాలు సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్, విద్య, వైద్యం, తాగునీటి వసతులు సరిపడా లేకపోవడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. అనుబంధ గ్రామాలు, గిరిజన తండాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో మండలంలో 20 గ్రామ పంచాయతీలుండేవి. నూతన పంచాయతీల ఏర్పాటులో భాగంగా నాలుగు నూతన పంచాయతీలను జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. మండలంలో అయ్యవారిగూడ, ధర్మన్నగూడ, తక్కళ్లపల్లితండా, కేస్లీతండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ఒకప్పుడు అనుబంధ గ్రామాలుగా ఉండి అంతగా అభివృద్ధికి నోచుకోని గ్రామాలు నేడు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి.
మండలంలోని అయ్యవారిగూడ గ్రామం నూతన పంచాయతీగా ఏర్పడిన అనంతరం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది. గ్రామానికి ఏనెకిందితండా అనుబంధంగా ఉంది. గ్రామంలో 200 కుటుంబాలు ఉండగా, తండాలో 80 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నల్లాతోపాటు ప్రతి గల్లీకి సీసీ రోడ్డును సుమారు 80శాతం నిర్మించారు. గ్రామంలో 60,000 సామర్థ్యం గల నీటి ట్యాంకును నిర్మించి ఇంటింటికీ రెండురోజులకు ఒకసారి తాగునీటిని ప్రజలకు అందిస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు అన్ని వసతులతో కూడిన ప్రాథమిక పాఠశాల ఉన్నది. గ్రామంలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్, విద్య, వైద్యం, తాగునీరు తదితర కనీస మౌలిక వసతులు స్వయంగా కల్పించడంతో గ్రామస్తుల ఇబ్బందులు క్రమంగా దశలవారీగా తీరుతున్నాయి. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత ఉట్టిపడుతుంది.
అయ్యవారిగూడ నూతన పంచాయతీగా ఏర్పడిన అనంతరం రూ.33లక్షలతో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. గతంలో కేవలం రెండు సీసీ రోడ్లు మాత్రమే ఉన్నాయి. రూ. 30లక్షలతో 7 సీసీ రోడ్లు, రూ. 3లక్షలతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారు. రూ. 9లక్షలతో పంచాయతీ ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీని కొనుగోలు చేశారు. రూ.16లక్షలతో వైకుంఠధామం, రూ.2.5లక్షలతో కంపోస్టు యార్డు, పల్లె ప్రకృతివనం. నర్సరీ నిర్వహణ పకడ్బందీగా చేపడుతున్నారు. పల్లె ప్రకృతి వనంలో జామ, దానిమ్మ, బొప్పాయి పండ్ల మొక్కలు కాయలు కాసి ఆదర్శంగా నిలుస్తున్నది. హరితహారం మొక్కలకు నీటిని పోసి సంరక్షిస్తున్నారు.
గ్రామపంచాయతీ అభివృద్ధే ప్రధాన లక్ష్యం. అయ్యవారిగూడతోపాటు అనుబంధంగా ఉన్న ఏనెకిందితండా అభివృద్ధికి కృషి చేస్తున్నా. ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా ముందుకు నడిపిస్తున్నాం. గ్రామంలో ఇంకా 20శాతం సీసీలు, ఒక ఓపెన్ నాలాను అండర్ డ్రైనేజీగా మార్చాలి. గ్రామంలో నూతన పంచాయతీ భవనం నిర్మించాలి. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.
– నేనావత్ గంగాబాయి, సర్పంచ్ అయ్యవారిగూడ
అనుబంధ గ్రామంగా ఉన్నప్పుడు అయ్యవారిగూడ అనేక సమస్యలతో సతమతమయ్యేది. ప్రజలకు కనీస వసతులులేక నానా ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం నూతన పంచాయతీగా ఏర్పడటంతో స్వయంగా నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మౌలిక వసతులను సమకూర్చుకొని ప్రజల అవసరాలను తీరుస్తున్నాం. నూతన పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తే మరింతగా అభివృద్ధి చేసుకుంటాం.
– నక్క మహేందర్, ఉప సర్పంచ్ అయ్యవారిగూడ