Ram Charan | సెలబ్రిటీలపై అభిమానుల ప్రేమ కొన్నిసార్లు హద్దులు దాటుతోంది. ఇటీవల పలువురు సినీ తారలు అభిమానుల హడావుడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. నిధి అగర్వాల్, సమంతతో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్‌కి కూడా విచిత్ర అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రి వద్ద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలోనూ ఇలాంటి పరిణామం చోటుచేసుకుంది. రామ్ చరణ్–ఉపాసన దంపతులకు ఇటీవల కవలలు జన్మించిన విషయం తెలిసిందే. ఒక బాబు, ఒక పాప పుట్టినట్లు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించగా, మెగా కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తన భార్య ఉపాసనను, నవజాత శిశువులను చూసేందుకు రామ్ చరణ్ తన పెద్ద కుమార్తె క్లీంకారతో కలిసి అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు.
అయితే చరణ్ కారు ఆసుపత్రి వద్దకు చేరుకోగానే వందలాది మంది అభిమానులు ఒక్కసారిగా అక్కడికి చేరుకుని హడావిడి సృష్టించారు. సెల్ఫీలు తీసుకోవాలనే ఉత్సాహంలో కారు చుట్టూ గుమిగూడి, ఆయన కిందకు దిగేందుకు కూడా వీలు లేకుండా చేశారు. ఆ సమయంలో చరణ్ చేతిలో చిన్నారి క్లీంకార ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అభిమానుల గోల, తొక్కిసలాటను చూసి క్లీంకార భయపడినట్లు వీడియోల్లో కనిపించింది. చరణ్ కూడా కాస్త అసహనంగా కనిపించినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.ఆసుపత్రి గేటు నుంచి లోపలికి వెళ్లే కేవలం అర నిమిషం వ్యవధిలోనే అభిమానుల హడావిడి తీవ్ర స్థాయికి చేరింది. కొంతమంది అభిమానులు క్లీంకార ఫోటోలు తీసేందుకు ప్రయత్నించగా, చిన్నారి ప్రైవసీని గౌరవించాలని, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని చరణ్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పరిణామంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల ప్రేమ అర్థం చేసుకుంటాం కాని,చిన్నారుల భద్రత, ప్రైవసీ దృష్ట్యా ఇలాంటి హడావుడి తగ్గాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. సెలబ్రిటీలను చూడాలనే ఉత్సాహంలో నియంత్రణ కోల్పోవడం ప్రమాదకరమని, అభిమానులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు సూచిస్తున్నాయి.