గత ప్రభుత్వాలు నిరుపేదలకు సాగు చేసుకుని బతికేందుకు సీలింగ్, అసైన్డ్ పట్టాలు, ప్రభుత్వ భూములను ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక రైతులందరినీ ఆదుకోవాలన్న సదుద్దేశంతో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి భూమి ఉన్న ప్రతి రైతుకూ ఎకరానికి రూ. ఐదు వేల చొప్పున ఎడాదికి రూ. పది వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్యతరగతి రైతన్నలను ఆగం చేస్తున్నది. సీలింగ్, అసైన్డ్ భూములు, కొండలు, వాగులు, రాళ్లు ఉన్నాయంటూ..భూమి సాగులో లేదంటూ రైతులకు రైతుభరోసాను నిలిపేసింది. దీంతో మండలంలో దాదాపు 250 ఎకరాలకు సుమారు 500 మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని నిలిపేయడంతో వారు పంటల సాగుకు ఇబ్బందిపడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో పంపిణీ కాగా.. మీరేందుకు ఇవ్వరని రేవంత్ ప్రభు త్వ తీరుపై మండిపడుతున్నారు. కాగా, మండలంలో 54,500 ఎకరాల భూమి ఉండగా.. రైతులు 25,649 మంది ఉన్నారు.
-మాడ్గుల, మార్చి 2
అన్నదాతను మోసం చేయడం తగదు..
నాకు రెండెకరాల సీలింగ్ పట్టా భూమి ఉన్నది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ఏటా రూ.20,000 పెట్టుబడి సాయం నిమిత్తం బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది. రేవంత్ సర్కార్ వచ్చాక సిల్లింగ్ పట్టాలకు రైతు భరోసా ఇవ్వకపోవడం దారుణం. పేదల ప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పుకొనే కాంగ్రెస్ నాయకులు అన్నదాతను మోసం చేయడం తగదు.
-కట్ట అంతయ్య, నల్లచెరువు గ్రామం, మాడ్గుల
ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాగానే పెట్టుబడి సాయాన్ని రూ.15,000 చెల్లిస్తామని హామీ ఇచ్చి..పవర్లోకి రాగానే మాట తప్పారు. ఇప్పుడు ఏడాదికి రూ. 12,000 ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా సీలింగ్ పట్టాలు, అసైన్డ్ భూములు తదితర వాటికి రైతుభరోసా ఇవ్వమని కొర్రీలు పెట్టి అన్నదాతలను దగా చేయ డం తగదు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి.
-సురమల్ల చెన్నయ్య, నాగిళ్ల గ్రామం, మాడ్గుల
పేదల పొట్ట కొడుతున్న రేవంత్రెడ్డి
కేసీఆర్ హయాంలో రైతన్నలు సుభిక్షంగా ఉన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అర్హులందరికీ రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీలింగ్ పట్టాలు, ఇతర భూములకు రైతుభరోసాను ఇవ్వకపోవడం దారుణం. రేవంత్రెడ్డి పాలనలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు.
– కర్నాటి చెన్నకేశవులు, ఆర్కపల్లి గ్రామం, మాడ్గుల
కొర్రీలతో పేదలకు అన్యాయం చేయొద్దు
ఎకరం ఎనిమిది గుంటల లావణి పట్టా భూమి ఉన్నా ఇప్పటివరకు రైతుభరోసా పెట్టుబడి సాయం రాలేదు. గత కేసీఆర్ హయాంలో ఏటా రూ. పది వేలకు పైగానే నా బ్యాంక్ ఖాతాలో నగదు జమ అయ్యింది. రేవంత్ సర్కార్ వివిధ కొర్రీలతో పేదలకు అన్యాయం చేయడం దారుణం. సీలింగ్, అసైన్డ్ పట్టాలు, ప్రభుత్వ భూములకు రైతుభరోసా ఇవ్వకపోవడం అన్యాయం. పేదల పొట్ట కొట్టొద్దు.
-గోరెంట్ల మంజుల, కలకొండ గ్రామం, మాడ్గుల