పరిగి, సెప్టెంబర్ 13 : సాధారణంగా సంబంధిత అధికారి లేకుంటే అక్కడే పని చేసే మరో సీనియర్‌కు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగిస్తారు…మండల స్థాయి అధికారులైతే పక్క మండలం అధికారిని నియమిస్తారు. కానీ, 90 కిలోమీటర్ల దూరంలోని మండలాలకు ఓ ఆఫీసర్‌కు ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ పాఠశాలల పర్యవేక్షణకు గాలికొదిలేసిందని చెప్పేందుకు ప్రత్యక్ష నిదర్శనం ఈ వార్త కథనం.. వివరాల్లోకి వెళ్తే.. 19 ఏండ్లుగా దోమ మండల విద్యాధికారిగా పనిచేస్తున్న హరిశ్చంద్ర గత మూడేండ్లుగా పరిగి, పూడూరు మండలాల ఇన్చార్జి ఎంఈవోగానూ కొనసాగుతున్నారు. అయితే.. జూలై 30న ఆయన మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని బాలానగర్ మండల విద్యాధికారిగా బదిలీ అయి.. జూలై 31న పదవీబాధ్యతలూ చేపట్టారు. అనంత రం కూకట్పల్లి ఎంఈవోగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అయితే హరిశ్చంద్ర బాలానగర్ ఎంఈవోగా బదిలీపై వెళ్లిన తర్వాత అతడి స్థానంలో దోమ, పరిగి, పూడూరు మండలాలకు ఇప్పటివరకు ఇన్చార్జి ఎంఈవోలను అధికారులు నియమించలేదు. ఈ మూడు మండలాలకు ఇప్పటికీ ఆయన్నే ఇన్చార్జి ఎంఈవోగా కొనసాగించడం విడ్డూరం. వికారాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా దాటిన తర్వాత ఉన్న మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని బాలానగర్‌లో ఎంఈవోగా పనిచేస్తున్న హరిశ్చంద్రను పరిగి, దోమ, పూడూరు మండలాల ఇన్చార్జి ఎంఈవోగా కొనసాగించడంలో ఉన్న ఔచిత్యమేమిటని విద్యాశాఖ ఉన్నతాధికారులను పలువురు ప్రశ్నిస్తున్నారు. బాలానగర్ నుంచి పరిగి 90 కిలోమీటర్లు, దోమ మండల కేంద్రం 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు జిల్లాలు దాటి వికారాబాద్ జిల్లాలోని మూడు మండలాల ఇన్చార్జి బాధ్యతలు ఆయన ఎలా పర్యవేక్షిస్తారని, దోమ నుంచి హరిశ్చంద్ర బదిలీ అయి దాదాపు నెల రోజు లు దాటినా ఇప్పటివరకు ఎందుకు ఇన్చార్జిలను నియమించలేదని ప్రశ్నిస్తున్నారు.
సమర్థులైన వారు లేరా ?
వికారాబాద్ జిల్లాలోని పరిగి, దోమ, పూడూరు మండలాల ఇన్చార్జి ఎంఈవో లుగా పనిచేసేందుకు సమర్థులైన వారు లేరా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పరిగి మండలంలో 44 ప్రాథమిక పాఠశాలలు, 8 యూపీఎస్‌లు, 11 ఉన్నత పాఠశాలలుండగా సుమారు 6,200 మంది చదువుతున్నారు. అదేవిధంగా పూడూరు మండలంలో 37 ప్రాథమిక పాఠశాలలు, 4 యూపీఎస్‌లు, 12 ఉన్నత పాఠశాలల్లో సుమారు 3,600 పైచిలుకు, దోమ మండలంలో 52 ప్రాథమిక పాఠశాలలు, 8 యూపీఎస్‌లు, 10 ఉన్నత పాఠశాలల్లో సుమారు 5,700 పైచిలుకు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దీంతోపాటు ప్రైవే ట్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లను ఎంఈవోలు పర్యవేక్షిస్తారని..నెల రోజులకు పైగా మూడు మండలాలకు ఇన్చార్జి ఎంఈవోను నియమించకపోవడం తగదని పలువురు పేర్కొంటున్నారు.
పరిగి పట్టణంలో మూడు ఉన్నత పాఠశాలలున్నాయి. ఇక్కడ సీనియర్ ఉపాధ్యాయులు జీహెచ్ఎంలుగా కొనసాగుతున్నారు. బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏకంగా డీఈవోకు గురువు. ఆయన గతంలో పూడూరు ఇన్చార్జి ఎంఈవోగానూ పనిచేశారు. పూడూరు, దోమ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా సీనియర్లు కొనసాగుతున్నారు. పైన పేర్కొన వారికి అదనపు బాధ్యతగా ఇన్చార్జి ఎంఈవోలు నియమిస్తే స్థానికంగా పాఠశాలల పర్యవేక్షణ బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని పరిగి, దోమ, పూడూరు మండలాలను మిన హాయిస్తే మిగతా మండలాల్లో జీహెచ్ఎంలే ఇన్చార్జి ఎంఈవోలుగా కొనసాగుతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు మూడు మండలాలలకు ఇన్చార్జి ఎంఈవోలను నియమించి పాఠశాలల పర్యవేక్షణను బలోపేతం చేయాలని పలువురు విద్యాభిమానులు సూచిస్తున్నారు.
ఇన్చార్జి ఎంఈవోలను నియమించాలి
ప్రభుత్వం స్పందించి మూడు మండలాలకు ఇన్చార్జి ఎంఈవోలను నియమిం చాలి. కోర్టు కేసులు ఉన్నాయనే సాకుతో పర్యవేక్షణాధికారులను నియమించకుంటే విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుంది. రెండు నుంచి ఐదు మండలాలకు ఒకే ఎం ఈవోను ఇన్‌చార్జ్జిగా కొనసాగిస్తే పర్యవేక్షణ కొరవడుతుంది.
-సత్యనారాయణరెడ్డి, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు