Jawahar Nagar | జవహర్‌నగర్, మే 1 : క్వారీ గుంతలో ఎవరైనా ఈతకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, యువత లోతు తెలియక ప్రమాదవశత్తు గుంతలో పడిపోయి తల్లిదండ్రులకు పుత్రశోకం మిగుల్చొద్దని జవహర్‌నగర్ ఎస్‌హెచ్‌వో సైదయ్య హెచ్చరించారు. జవహర్‌నగర్ కార్పొరేషన్ మల్కారం క్వారీ గుంతతో సరదా కోసం యువకులు ఈతకు వస్తూ గత రెండు నెలల్లోనే నలుగురు యువకులు మృత్యువాత పడిన విషయం ప్రతి ఒక్కరిని కలిచివేసింది.
జవహర్‌నగర్ ఎస్‌హెచ్‌వో సైదయ్య ఆధ్వర్యంలో గురువారం బాలాజీనగర్ సబ్ ఇన్స్పెక్టర్ రామునాయక్ సమక్షంలో క్వారీ గుంత చుట్టూ ఫెన్సింగ్ వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సైదయ్య మాట్లాడుతూ ఫోటో షూట్ కోసం వస్తున్న యువకులు సోషల్ మీడియాలో మల్కారం క్వారీ గుంతపై ప్రచారం చేయడంతో నగరంలోని పలువురు యువత గూగుల్ మ్యాప్‌లో వెతుక్కుంటూ ఇక్కడకు వస్తున్నారని, సరదాగా గుంతలోకి దిగడంతో ఈతరాక యువకుల ప్రాణాలు పోతున్నాయని అన్నారు. భవిష్యత్ తరాలకు బాటలు వేయాల్సిన యువకులు క్వారీ గుంతలో పడి ప్రాణాలు తీసుకోవద్దని పేర్కొన్నారు. మల్కారంలోని క్వారీ గుంత వద్దకు యువకులు వెళ్ళవద్దని, చట్టానికి విరుద్ధంగా వెళ్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జవహర్‌నగర్ పోలీసులు, యువకులు పాల్గొన్నారు.