ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 23 : ఉరుకులు.. పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడంలేదు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ లేకపోవడంతో చాలామంది అక్కడికక్కడే మృతిచెందిన, గాయాలైన సందర్భాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. హెల్మెట్ ఉంటే ఏమీ జరుగకుండా ఉండేది అనుకుంటామే తప్ప హెల్మెట్‌ను మాత్రం పెట్టుకోవడంలేదు. అవగాహన లేని వాహనదారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదని వాహనాల తయారీదారులు, రవాణావాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నప్పటికీ గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆతృతతో హెల్మెట్ వాడకాన్ని విస్మరిస్తున్నారు. శరీరంలో అన్ని అవయవాల కంటే తలకు విశిష్టమైన స్థానం ఉన్న సంగతి తెలిసిందే. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మెదడుకు దెబ్బ తగిలినచోట ఉన్న మెదడు కణాలుగా పిలిచే న్యూరాన్లు నశిస్తాయి. దీనివల్ల అవయవాలు శాశ్వతంగా చచ్చుబడిపోతాయి. కాబట్టి తలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ద్విచక్రవాహనదారులు హెల్మెట్ కచ్చితంగా పెట్టుకోవాలని మోటారు వాహనాల చట్టం 1998లోని 129, 177 సెక్షన్లు చెబుతున్నాయి. దీని ప్రకారం ఎవరైనా హెల్మెట్ ధరించకపోతే జరిమానా విధించే అవకాశాలున్నాయి. పదేపదే వాహనదారుడు హెల్మెట్ లేకుండా జరిమానా పడుతుంటే డ్రైవింగ్ లెసెన్స్ శాశ్వతంగా రద్దుచేసే అవకాశముంటుంది. యువత హెల్మెట్ పెట్టుకోవడాన్ని నామోషీగా ఫీలవుతూ.. రోడ్డు ప్రమాదాలకు గురై తమ నిండు ప్రాణాలను బలిచేసుకుంటున్నారు.
నాణ్యమైన హెల్మెట్ ఉపయోగించాలి
నాసిరకం హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాద తీవ్రతను ఏమాత్రం తగ్గించలేవన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవడంతో హెల్మెట్ కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. హెల్మెట్ స్ట్రాప్ గడ్డంపై ఉంచేందుకు అనువుగా ఉండేలా ఎంపిక చేసుకోవాలి. తలకు ధరించినప్పుడు స్ట్రాప్ తీసుకునేందుకు, పెట్టుకునేందుకు వీలుగా ఉండాలి. ప్రధానంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఐఎస్ఐ అనుమతులు పొందిన కంపెనీల హెల్మెట్లు ధరించాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. హెల్మెట్ వాడటం వల్ల ప్రమాదాలు జరిగినా తలకు అయ్యే గాయాల తీవ్రతను తగ్గిస్తుంది. ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి 98 శాతం బయటపడొచ్చు. దుమ్ము, దూళి, ఎండ నుంచి రక్షణ కల్పిస్తుంది.
హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి
ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకుండా వచ్చే ద్విచక్ర వాహనదారుల వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయటంలేదు. రిజిస్ట్రేషన్ సమయంలో హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మోటారు యాక్ట్ చట్టం కింద జరిమానా విధించటంతోపాటు వాహనాన్ని సీజ్ చేస్తాం. ఇబ్రహీంపట్నంలో ఇప్పటికే పలుమార్లు హెల్మెట్ ధరించనివారికి అవగాహన కూడా కల్పిస్తున్నాం. హెల్మెట్ ధరించకుండా రోడ్లపై ప్రయాణం చేస్తే సహించేదిలేదు.
– గురునాయుడు, టాఫ్రిక్ సీఐ, ఇబ్రహీంపట్నం