షాద్నగర్ రూరల్/నందిగామ, జూన్ 09: భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం ప్రారంభించారు.
అనంతరం నందిగామ తహశీల్దార్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించి భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని తెలిపారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ సమస్యలను దరఖాస్తు రూపంలో సమర్పించాలని, అధికారులు తప్పకుండా సమస్యలు పరిష్కరం చేస్తారని తెలిపారు. గ్రామాల్లో అర్హులైన పేదలకు విడతలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు.
అంతకుముందు ఫరూక్ నగర్ మండలంలోని లింగారెడ్డిగూడలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని, ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించాలని సూచించారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కలవని, నాణ్యమైన మధ్యాహ్నభోజనంతోపాటు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు క్రమశిక్షణతో కూడిన విద్యను బోధిస్తారన్నారు. సంపూర్ణ అక్షర సాధనతో రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలన్నారు.