కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 24 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ గాయత్రి నగర్లో గత 25 రోజులుగా చుక్క మంచినీరు(Water) రావడం లేదంటూ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లో ప్రెషర్ కారణంగా గాయత్రి నగర్ మంచినీటి సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని కాలనీవాసులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఐడిపిఎల్ జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కాలనీలో వచ్చి సమస్యను చూశారు.
25 రోజులు కావస్తున్నా ఇప్పటికి చుక్క నీరు కూడా రావడం లేదంటూ అధికారులతో కాలనీవాసులు పలుమార్లు ఫిర్యాదు చేసినా, నేరుగా వెళ్లి కలిసినా అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదంటూ మండిపడుతున్నారు. వాడుకోవడానికి బోర్ల నీళ్లు కూడా అడుగంటడంతో చాలీచాలని నీటితో ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతుల పేరుతో కాలయాపని చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత జలమండలి అధికారులు కాలనీలో నెలకొన్న మంచినీటి కొరతను తీర్చేలా తగు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కాలనీవాసులందరం ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.