కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్భాటం తప్ప ఏ ఒక్క నిర్ణయమూ అమలుకు నోచుకోవడంలేదు. రుణమాఫీ విషయంలో రైతులకిచ్చిన హామీ మేరకు చేయకుండానే పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకోవడం తప్ప అర్హులుగా గుర్తించినవారికి అన్యాయం చేస్తున్నది. ఎన్నికలకు ముందు ఒకే దఫాలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు తర్వాత రేషన్ కార్డులను పరిగణనలోకి తీసుకోవడం.. తదితర కొర్రీలు పెట్టి అర్హులైన పేద అన్నదాతలకు రుణమాఫీ వర్తించకుండా రేవంత్ ప్రభుత్వం దూరం చేసింది. రూ.2 లక్షలలోపు రుణాలను మాఫీ చేశామని సర్కారు ప్రచారం చేసుకుంటున్నది కానీ వాస్తవానికి ఇంకా రూ.2 లక్షలలోపు రుణమాఫీ పూర్తికాలేదు.
గతేడాదిగా తమ రుణాలను ఎప్పుడు మాఫీ చేస్తారంటూ కలెక్టరేట్‌తోపాటు వ్యవసాయాధికారి కార్యాలయాల చుట్టూ అన్నదాతలు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. జిల్లాలో రూ.2 లక్షలలోపు పంట రుణాల మాఫీకి సంబంధించి 1,00,828 మంది రైతులకు సంబంధించిన రూ.849 కోట్ల రుణాలను మాఫీ చేసింది. మరోవైపు మాఫీ సంగతి మరిచి రైతు భరోసా ఇచ్చామని ప్రభుత్వం సంబురాలు జరుపుకొం టుండటంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– వికారాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ)
పంట రుణాల మాఫీకి సంబంధించి రూ.2 లక్షలపైన ఉన్న మొత్తాన్ని అధికారులు తెలిపిన తేదిలోగా చెల్లించినా ఇప్పటివరకు సర్కారు నుంచి ఎలాంటి స్పష్టత లేదు. అయితే రూ.2 లక్షల పైన ఉన్న రుణాలను చెల్లిస్తేనే రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయాధికారులు చెప్పడంతో గతేడాది ఆగస్టు 15లోపు రైతులు చెల్లించారు. కటాఫ్ రుణానికి మించి ఉన్న అన్నదాతల్లో చాలామంది ఇప్పటికే పైన ఉన్న రుణాలను చెల్లించి సంబంధిత రశీదులను వ్యవసాయాధికారులకు అందజేసినప్పటికీ ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు మాఫీ అవుతుందని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు రుణాలను మాఫీ చేస్తున్నామంటూనే తిరిగి అన్నదాతల నుంచి ముక్కు పిండి వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందు ప్రగల్భాలు చెప్పి ఇప్పుడు నట్టేట ముంచుతుండడంపై రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రేషన్ కార్డులు లేకపోవడంతోనే..
రుణమాఫీ ప్రక్రియ మొదలైనప్పుడు రూ.2 లక్షలలోపు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని చెప్తూ వచ్చిన సర్కారు, అన్నదాతలు రూ.2 లక్షలపైన ఉన్న మొత్తాన్ని చెల్లించిన తర్వాత మాట మార్చింది. రూ.2 లక్షలలోపు రుణాలను మాఫీ చేస్తామని హామీనిచ్చి, రైతులు తీసుకున్న పంట రుణాలతోపాటు ఆ రుణాలకైన వడ్డీని కలిపి రూ.2 లక్షల వరకు మాఫీ చేసింది. అన్నదాతలకు ఒక హామీనిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేయడంపై వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలా మంది రైతులకు అన్యాయం జరిగింది. రూ.1.50 లక్షల రుణాలు తీసుకున్నా వడ్డీతో కలిపి రూ.2 లక్షలయితే మాత్రమే రుణమాఫీకి అర్హులుగా పరిగణనలోకి తీసుకున్నారు.
మరోవైపు రుణాలు రూ.2 లక్షలకు పైగా ఉన్న అన్నదాతలు మిగతా రుణాలను చెల్లించేందుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా గ్రీవెన్స్‌కు సంబంధించి దాదాపు 30 వేల వరకు రైతులు రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేశారు. జిల్లావ్యాప్తంగా 18,431మంది అన్నదాతలకు రేషన్‌కార్డులు లేకపోవడంతోనే రుణమాఫీ కాలేదని వ్యవసాయాధికారులకు వచ్చిన ఫిర్యాదులతో స్పష్టమైంది. అధికంగా నవాబుపేట మండలంలో రెండు వేల మందికిపైగా రైతులు ఫిర్యాదు చేశారు. గ్రీవెన్స్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకు దరఖాస్తులను పరిష్కరించకుండానే పక్కన పెట్టారనే విమర్శలు న్నాయి.
పూర్తిస్థాయిలో అమలు చేయాలి
రైతులకు 2లక్షల వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాని ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదు. గత పంటకు సంబంధించిన రైతు భరోసా పూర్తిగా ఇవ్వలేదు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో రైతు భరోసా అమలు చేశామని సంబరాలు చేసుకోవడం తగదు. దీన్ని అన్నదాతలు నమ్మే స్థితిలో లేరు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసి, గత పంటకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు రైతులందరి ఖాతాల్లో జమచేయాలి. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక్క పంటకు మాత్రమే భరోసా నిధులు విడుదల చేయడం తగదు.
– జుబేర్, అడవివెంకటాపూర్, చౌడాపూర్ మండలం
అప్పులపాలు చేసింది
రైతులకు 2లక్షల వరకు పంటరుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు అన్నదాతలకు 2లక్షల రుణమాఫీ చేయక అప్పులపాలు చేసింది. రుణాలను చెల్లిస్తారనే ఆశతో తీసుకున్న రుణాలు చెల్లించలేని స్థితిలో అన్నదాతలున్నారు. 2లక్షల రుణాలు తీసుకున్న రైతులపై ప్రభుత్వం పెదవి విప్పాలి. ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ మాఫీ చేయాలి. రెండు లక్షలపైన ఉన్న రుణాలను రైతులు చెల్లించుకుంటారు.
– దామోదర్‌రెడ్డి, రైతు, రాంరెడ్డిపల్లి, కులకచర్ల మండలం