వికారాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నగారా మోగింది. శనివారం కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్నది. నామినేషన్లను దాఖలు చేసేందుకుగాను ఏప్రిల్ 25 వరకు ఎన్నికల సంఘం గడువిచ్చింది. ఏప్రిల్ 26న నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకుగాను ఏప్రిల్ 29 వరకు గడువిచ్చింది. మే 13న పోలింగ్ జరుగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపుతోపాటు ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దృష్ట్యా శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అదేవిధంగా లోక్‌సభ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకుగాను జిల్లా ఎన్నికల అధికారులు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చేవెళ్ల లోక్‌సభకు సంబంధించి నాలుగోసారి ఎన్నికలు జరుగనున్నాయి. మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటి సారి 2009లో ఎన్నికలు జరుగగా, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎస్.జైపాల్‌రెడ్డి ఎంపీగా గెలుపొందారు. తదనంతరం 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ పార్టీ విజయదుందుబి మోగించింది. 2014 ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, 2019 ఎన్నికల్లో గడ్డం రంజిత్‌రెడ్డిలు బీఆర్ఎస్ తరఫున ఎంపీలుగా గెలుపొందారు. ఈ దఫా ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కాసాని జ్ఞానేశ్వర్ బరిలో ఉండగా, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
షెడ్యూల్ విడుదల చేసిన దృష్ట్యా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్‌ను ఎవరూ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సిద్ధమైంది. ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలోని పోస్టర్లు, బ్యానర్లను 24 గంటల్లో తొలగించనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో బ్యానర్లను 48 గంటల్లో తొలగించాలని, ఇంటి యజమాని అనుమతితోనే బ్యానర్లు, గోడపత్రికలను అతికించాలని, అనుమతిలేనట్లయితే 72 గంటల్లో తొలగించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు వరకు ఆయా పార్టీల ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రచారాన్ని నిషేదిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆలయాలు, మసీదులు, చర్చీల్లో ప్రచారం చేసేందుకు వీలులేదు. జిల్లా అంతటా పోలీసులు నిఘా పెంచనున్నారు. జిల్లాలో అంతర్రాష్ట చెక్‌పోస్టులతోపాటు అంతర్ జిల్లా చెక్‌పోస్టులను అందుబాటులోకి తీసుకురానున్నారు. సంబంధిత చెక్‌పోస్టుల్లో తనిఖీలను ముమ్మరం చేయనున్నారు. రూ.50 వేలకు మించి నగదు తరలించే వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
మే 13న జరుగనున్న చేవెళ్ల లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ఓటరు తుది జాబితాను విడుదల చేసిన అధికారులు మిగతా ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యారు. ఎన్నికల నిర్వహణకుగాను సుమారు 9 వేల సిబ్బంది అవసరమని గుర్తించిన జిల్లా ఎన్నికల అధికారులు త్వరలోనే ఎన్నికల సిబ్బందిని నియమించి, వారికి శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి రానుండగా, కొడంగల్ నియోజకవర్గం మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నది. జిల్లాకు సరిపోను ఈవీఎంలతోపాటు అదనంగా ఈవీఎంలను అందుబాటులో ఉంచారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తీసుకెళ్లడం, పోలింగ్ పూర్తయిన అనంతరం తిరిగి స్ట్రాంగ్‌రూంకు తీసుకెళ్లే వరకు పకడ్బందీ ఏర్పాట్లను చేస్తుండడంతోపాటు రూట్ మ్యాప్‌లను కూడా తయారు చేస్తున్నారు.
పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలను ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవీఎంల పనితీరుపై ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అవగాహన కల్పించిన జిల్లా యంత్రాంగం, ఓటర్లకు కూడా ముందస్తుగా ఈవీఎంల పనితీరుపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంచారు. ఈవీఎంలకు సంబంధించి ఫస్ట్ లెవల్ చెక్ ప్రక్రియ పూర్తి కాగా, మరో వారంలో రెండో విడుత ఈవీఎంల పరిశీలన ప్రక్రియను చేపట్టనున్నారు. ఈవీఎంలకు సంబంధించి ఏదైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే వెంటనే వేరే ఈవీఎంలను ఏర్పాటు చేసే విధంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో అదనంగా ఈవీఎంలను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు.
జిల్లాలోని 1133 పోలింగ్ కేంద్రాలకు అదనంగా ఈవీఎంలను సమకూర్చేందుకుగాను ఈవీఎంలు తక్కువ పడడంతో ఈసీఐఎల్ నుంచి జిల్లాకు కొత్తగా ఈవీఎంలను ఎన్నికల సంఘం చేరవేర్చింది. జిల్లాకు అదనంగా 275 ఈవీఎంలు ఈసీఐఎల్ సంస్థ నుంచి జిల్లాకు చేరుకున్నాయి. ప్రస్తుతం జిల్లాలో బ్యాలెట్ యూనిట్లు-2267, కంట్రోల్ యూనిట్లు-1694 ఉండగా, వీవీప్యాట్లు-1791 ఉన్నాయి.
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకుగాను కొత్త ఓటరు నమోదు చేసుకునేందుకుగాను ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. నామినేషన్లు ముగిసే వరకు అంటే ఏప్రిల్ 25 వరకు మీసేవ లేదా ఆైన్లెన్ ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడంతోపాటు మార్పులు, చేర్పులకు అవకాశమిచ్చింది.