Paddy Procurment | ఇబ్రహీంపట్నం, మే 2 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నెల రోజుల నుంచి వరిపంటలు ప్రారంభమయ్యాయి. పదిరోజుల క్రితం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికి వాటిద్వారా నేటికి వరిధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవటం విడ్డూరంగా ఉందని రైతులు వాపోతున్నారు. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం, దండుమైలారం, మంచాల, బోడకొండ, యాచారం, మంతన్గౌరెల్లి, నందివనపర్తి, చింతపట్ల, తొర్రూరు, గౌరెల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
కాని, ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా నేటికి కొనుగోళ్లు ప్రారంభించలేదు. వరిపంటకోసి నెలరోజులు గడుస్తుందని, ప్రతిరోజు సాయంత్రంవేళలో కురుస్తున్న వర్షానికి పూర్తిగా ఎండిన ధాన్యం తడిసిపోతుందని రైతులు వాపోతున్నారు. కిరాయికి ధాన్యం ఆరబోసేందుకు తీసుకువచ్చిన పడాలు చెదలు పడుతున్నాయి. దీంతో ధాన్యం కూడా భూమిపాలవుతోందని రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో వరిపంట కోయగానే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముడుపోయి, రెండురోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవని, ఈ కాంగ్రెస్ సర్కారు వచ్చినంక తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పదిరోజులు గడిచిపోతుందని, నేటికి లేబర్ సమస్యా ఉందని, గన్నీ బ్యాగులు అందుబాటులో లేవనే సాకుతో అధికారులు దాటవేత దోరణి అవలంభిస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపిస్తున్నారు.
వేధిస్తున్న గన్నీ భ్యాగుల కొరత..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీఎంఎస్ ఆద్వర్యంలో ప్రారంభించారు. కాని, కేవలం దండుమైలారంతో పాటు తొర్రూరు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకాలు ప్రారంభించినప్పటికి, ఈ కొనుగోలు కేంద్రాల్లో గన్నీ భ్యాగుల సమస్య రైతులను వేదిస్తోంది. గన్నీభ్యాగులు సమకూర్చి రైతుల ధాన్యం ఎప్పటికప్పుడు సేకరించాలని పలువురు రైతులు కోరుతున్నారు.
పైరుకోసి నెల రోజులవుతున్నా ధాన్యం కొంటలేరు
వరిపంట కోసి నెలరోజులు దాటిపోతుంది. బోడకొండ దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రం పదిరోజుల కింద ప్రారంభించారు. నేటికి ధాన్యం కొంటలేరు. గ్రామాల్లో పర్యటించే అధికారులను అడిగితే లేబర్ ఒస్తలేరు ఆగాలి. కొంటాం అంటూ దాటవేస్తున్నారు. రోజు పొద్దుగాల వచ్చి ధాన్యం ఎండబోస్తున్నం. సాయకాలం అవగానే అకాల వర్షం కురిసి ధాన్యం నానిపోతుంది. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థమైతలేదు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి.
-రమావత్ నడ్జా, కొర్రవానితండా
కాంగ్రెస్ వచ్చినంక అన్ని కష్టాలే వచ్చాయి
వరిధాన్యం ఆరబెట్టేందుకు పొద్దుగాల కల్లాంలోకి వచ్చి ఎండబెడుతున్నాం. పొద్దటినుంచి సాయంత్రం దాక ఎండలు ఎండి విషజ్వరాలు వస్తున్నాయి. సాయంత్రం దవాఖానాకు పోయి మందులు, సూదులకు వందల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఎన్నిరోజులు ఎదురుచూసుకుంట కూసోవాలి సారు. మా ధాన్యం కొనుగోలు చేసి మాకు న్యాయం చేయాలి. కేసీఆర్ సారు ఉండంగా ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడు పంటకోస్తే అప్పుడు ధాన్యం కొని, వెంటనే డబ్బులు వేసింది. ఈ కాంగ్రెస్ వచ్చినంక మాకు అన్ని కష్టాలే వచ్చాయి.
-జాటోతు నాను, బోడకొండ
గన్నీ భ్యాగులు సమకూర్చాలి
గన్నీ బ్యాగులు లేక కొనుగోలు నిలిచిపోయాయి. మూడు రోజుల నుంచి గన్నీభ్యాగులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వెంటనే గన్నీ భ్యాగులు సమకూర్చి కల్లాల్లో ఉన్న వరిధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలి.
-లింగం, దండుమైలారం
కేసీఆర్ ఉన్నప్పుడే ఎప్పటికప్పుడు కొని డబ్బులిచ్చిండు
కేసీఆర్ ఉన్నప్పుడు వరిపంట కోసే సమయానికంటే ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండేవి. ధాన్యం కొనుగోలు జరిగిన రెండు రోజుల్లోనే ఖాతాల్లో ధాన్యం డబ్బులు పడేవి. కాని, ఈ రేవంత్ సర్కారు వచ్చినంక కష్టాలు కొని తెచ్చుకున్నట్లయ్యింది. నెలరోజుల నుంచి ధాన్యం కల్లంలోనే మూలుగుతుంది. ఇక్కడినుంచి రెండురోజుల క్రితం లోయపల్లికి పోతున్నా ఎమ్మెల్యేను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి.
– రమావత్ కోక్యానాయక్, కొర్రవానితండా