రంగారెడ్డి, జనవరి 6, (నమస్తే తెలంగాణ): జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు గ్రేడ్లను కేటాయించారు. స్వయం సహాయక సంఘాల పనితీరును బట్టి ఏ, బీ, సీ, డీ గ్రేడ్లుగా నిర్ణయించారు. అయితే సంఘాల సమావేశ వివరాలు అంతర్గత అప్పు ల వివరాలు, బ్యాంకు రుణాలు, అప్పుల చెల్లింపులు, పెండింగ్ బకాయిలు, స్త్రీనిధి రుణాలు, ఎన్ఆర్ఎల్ఎం నిధులు, ప్రతినెలా నిర్వహించే సమావేశ వివరాలు, తీర్మానాలతోపాటు ఆయా సంఘాల పనితీరును బేరీజు వేసుకొని ఎస్‌హెచ్‌జీలను గ్రేడ్లుగా విభజించారు. జిల్లాలో మొత్తం 19,381 సంఘాలుండగా 2.25 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులున్నారు.సంబంధిత ఎస్‌హెచ్‌జీల్లో 80.16 శాతం స్వయం సహాయక సంఘాలు ఏ గ్రేడ్‌లోనే ఉండడం గమనార్హం. జిల్లాలోని 19,381 సంఘాల్లో ఏ గ్రేడ్‌లో 15,235 సంఘాలు, బీ గ్రేడ్‌లో 535 సంఘాలు, సీ గ్రేడ్‌లో 1684 సంఘాలు, డీ గ్రేడ్‌లో 1927 సంఘాలున్నాయి. పనితీరు సరిగ్గాలేని సీ, డీ గ్రేడ్లలోని స్వయం సహాయక సంఘాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సంబంధిత గ్రేడ్లలోని ఎస్‌హెచ్‌జీలు చాలా వరకు తీసుకున్న అప్పులను నిర్ణీత గడువులోగా చెల్లించకపోవడం, క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించకపోవడం వంటి కారణాలతో వెనుకంజలో ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. పనితీరు సరిగ్గా ఉంటూ ఎస్‌హెచ్‌జీలకు ఒక్కో సంఘానికి అత్యధికంగా రూ.20 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసే రుణాల లక్ష్యాన్ని రూ.571 కోట్ల వడ్డీలేని రుణాలను మంజూరు చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు రూ.380 కోట్ల రుణాలను ఎస్‌హెచ్‌జీలకు మంజూరు చేశారు.
జిల్లా అంతటా అమల్లోకి వచ్చిన ఆన్లైన్ నిర్వహణ…
ప్రస్తుత రోజుల్లో ప్రతీది ఆన్లైన్ కావడంతో మహిళా సంఘాల సభ్యుల ఆర్థిక లావాదేవీల నిర్వహణను కూడా ఆన్లైన్లోనే నిర్వహించేలా చర్యలు చేపట్టి తొలుత జిల్లాలోని 11 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమల్లోకి తీసుకువచ్చిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ప్రస్తుతం జిల్లా అంతటా ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది. పుస్తకాల్లో రాసే విధానానికి పూర్తిగా ఫుల్స్టాప్ పెడుతూ మహిళా సంఘాల ప్రక్రియ అంతా ఆన్లైన్లో చేసేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ప్రత్యేక యాప్ నిర్వహణకు సంబంధించి ఆయా మండలాల్లోని వీవోఏలతోపాటు సీసీలకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. ప్రస్తుతం మహిళా సంఘాల వివరాలను యాప్‌లో పొందుపరుస్తున్నారు. గతం లో మాదిరిగా పుస్తకాల్లో సంఘాల వివరాలను రాయకుండా నేరుగా యాప్‌లోనే పొందుపరుస్తున్నారు. సంఘాల సమావేశ వివరాలు, అంతర్గత అప్పుల వివరాలు, బ్యాంకు రుణాలు, స్త్రీనిధి రుణాలు, ఎన్ఆర్ఎల్ఎం నిధులు, ప్రతినెలా నిర్వహించే సమావేశ వివరాలు, తీర్మానాలను ఎప్పటికప్పుడు యాప్‌లో పొందుపరుస్తున్నారు. అంతేకాకుండా మహిళా సంఘాలు ఎప్పుడు రుణం తీసుకున్నారు, ఎవరెవరు ఎంత మొత్తంలో తీసుకున్నారు, తీసుకున్న రుణంతో ఏ వ్యాపారం చేస్తున్నారు, ఎంత తిరిగి చెల్లించారు తదితర వివరాలను ఫొటోలతోపాటు యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. మహిళా సంఘాలు ప్రత్యేక యాప్‌ను నిర్వహించేందుకుగాను ప్రతీ మహిళా సంఘానికి యూజర్ ఐడీతోపాటు పాస్‌వర్డ్‌ను అందించారు. అయితే సంబంధిత మహిళా సంఘాల్లోని సభ్యులకు యాప్ నిర్వహణ తెలియనివారు ప్రత్యేకంగా ఒకరిని నియమించుకున్నారు. అయితే ఇప్పటివరకు మహిళా సంఘాల నిర్వహణకు సంబంధించి వీవోఏలు పుస్తకాల్లో రాయడంతోపాటు ట్యాబ్‌లో వివరాలను పొందుపర్చేవారు. యాప్‌తో ఆయా మండలాల్లోని మహిళా సంఘాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సీసీలు, ఏపీఎం, డీపీఎంలు సులువుగా తెలుసుకోవచ్చు, అంతేకాకుండా జిల్లావ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల సమాచారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారితోపాటు సెర్ప్ సీఈవోకు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే సెర్ప్ సీఈవో, డీఆర్డీవో, డీపీఎం, ఏపీఎం, సీసీలకు కూడా ప్రత్యేక యాజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కేటాయించారు.
వెనుకంజలో ఉన్న సంఘాలపై ప్రత్యేక దృష్టి
జిల్లాలోని స్వయం సహాయక సంఘాలను పనితీరును బట్టి గ్రేడ్లుగా విభజించాం. పనితీరు సరిగ్గాలేని సంఘాలకు సీ, డీ గ్రేడ్లను కేటాయించాం. అంతేకాకుండా సీ, డీ గ్రేడ్లలోని స్వయం సహాయక సంఘాలపై ప్రత్యేక దృష్టి సారించాం. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న అప్పులను నిర్ణీత గడువులోగా చెల్లించడం, ఆర్థిక లావాదేవీలన్ని ఆన్లైన్లో నిర్వహించడం, ప్రతినెలా సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం – కె.జంగారెడ్డి డీఆర్డీఏ ఏపీడీ