షాబాద్, మే 11: చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి. గత నెల 13వ తేదీన చేవెళ్లలో నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ నాయకులు, నేతల్లో నూతనోత్తేజాన్ని నింపింది. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు దాదాపు నెల రోజులుగా జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో జోరుగా ప్రచారం నిర్వహించారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజల పడుతున్న ఇబ్బందులను ప్రతి గడపకూ తీసుకెళ్లారు. బీఆర్ఎస్ ఆరు ఎంపీ సీట్లను బీసీలకు కేటాయించడంతో ఆ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
చేవెళ్ల సీటు బీసీనేత కాసాని జ్ఞానేశ్వర్‌కు కేటాయించడంతో వివిధ బీసీ కుల సంఘాలన్నీ సమావేశాలు నిర్వహించి కాసానికి స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు, 96 బీసీ కులాలను ఏకం చేసి వారి సమస్యలపై పోరాటం చేసిన జ్ఞానేశ్వర్‌ను గెలిపించడమే లక్ష్యంగా కులసంఘాల నేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
హ్యాట్రిక్ సాధించడమే లక్ష్యంగా..
చేవెళ్ల గడ్డపై హ్యాట్రిక్ విజయం సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతున్నది. చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరంగా సాగింది. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఘన విజయం సాధించింది. గతంలో ఈ పార్టీ నుంచి గెలిచిన గడ్డం రంజిత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీల నుంచి బరిలో నిలువగా.. ప్రజల నుంచి వారికి మద్దతు కరువైంది. కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించి మూడోసారి చేవెళ్ల గడ్డపై గులాబీ జెండాఎగురవేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు పని చేశాయి. సుమారు 29 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా, అందులో 16లక్షల వరకు బీసీ ఓటర్లు ఉండడం కాసాని గెలుపునకు కలిసి రానున్నదని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
కేసీఆర్ సభతో నయా జోష్..
చేవెళ్లలో గత నెల 13వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. చేవెళ్ల సభకు అనుకున్న దానికంటే జనాలు అధిక సంఖ్యలో రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ విజయం ఖాయమని చెబుతున్నారు. నేతలు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మాజీ మంత్రి సబితారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రోడ్ షోలు నిర్వహించారు. శనివారం ప్రచారం చివరి రోజు కావడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారాల్లో పాల్గొన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ గెలుపొందడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.