పెద్దఅంబర్‌పేట, ఫిబ్రవరి 23 : మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కుంట్లూరులోని ఓ కాలేజీ భవనం ఎదుట ప్లకార్డులు చేతపట్టుకుని నిరసనకు దిగారు. ‘ఆస్తి పన్ను చెల్లించండి. పుర ప్రగతికి తోడ్పాటునివ్వండి’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని తట్టిఅన్నారంలోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. మొండి బకాయిల వసూళ్లకు మున్సిపల్ అధికారులు ఒక్కోచోట ఒక్కోలా వినూత్న నిరసనను ఎంచుకుంటున్నారు. ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై అధికారులు శ్రద్ధ పెట్టారు. పన్ను బకాయిలు ఉండడంతో ప్రగతి పనులు కుంటు పడుతాయని పేర్కొంటున్నారు. మార్చితో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పన్ను వసూళ్లలో మరింత వేగం పెంచారు. ఇప్పటివరకు లక్ష్యంలో 51 శాతం ఆస్తి పన్నులు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. మొండి బకాయిలు వసూలైతే ఆ శాతం పెరుగుతుందన్నారు.
ప్రత్యేక బృందాలు
మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా.. మొత్తం 8 మంది బిల్ కలెక్టర్లు ఉన్నారు. వార్డుల్లోని ఆయా కార్యాలయాల దగ్గర వీరు ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. కొన్నిసార్లు నేరుగా ఇండ్లకు వెళ్తున్నారు. మొండి బకాయిదారుల జాబితాను సిద్ధం చేశారు. ఒక్కో వార్డులో వంద మందితో కూడిన జాబితాలు తయారుచేశారు. వారినుంచి పన్ను వసూళ్లకు ప్రత్యేకంగా ముగ్గురితో కూడిన కొన్ని టీంలను ఏర్పాటుచేశారు. జాబితాలోని నంబర్లకు ఫోన్ చేసి పన్ను చెల్లించాలని కోరుతున్నారు.
గతంతో పోలిస్తే ఎక్కువే
మున్సిపాలిటీలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.14.04 కోట్ల ఆస్తి పన్నులు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు లక్ష్యంలో దాదాపు 51శాతం రూ.7కోట్ల పైచిలుకు పన్నులు వసూలు చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 47.34శాతం వసూలు చేశారు. 2020-21లో రూ.8.6కోట్లు వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. 7.59 కోట్లు అంటే 88 శాతం పన్నులను దిగ్విజయంగా వసూలు చేశారు.
పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి..
ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాం. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు లక్ష్యం చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాం. పన్ను చెల్లిస్తేనే ప్రగతి పనులు ముందుకు సాగుతాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. పన్నులు చెల్లించని వాణిజ్య సముదాయాలు, వ్యాపార దుకాణాల ఎదుట పారిశుధ్య కార్మికులతో నిరసన కార్యక్రమాలు చేపట్టాం. మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు ఇచ్చాం. అయినప్పటికీ పన్ను కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తాం.
– బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, కమిషనర్, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ