తాండూరు, ఫిబ్రవరి 22: తాండూరు నియోజకవర్గంలో వివిధ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి సమీపంలో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి. కళాశాల అడ్మీషన్లు ప్రారంభ మైనప్పటికీ పనులు మాత్రం నామమాత్రంగానే జరుగుతున్నాయి. ఈ ఏడాది అడ్మీషన్లు తీసుకున్న విద్యార్థులకు ఆన్లైన్లోనే పాఠ్యంశాల బోధన జరు గుతున్నది.
ఇప్పటికీ 30 శాతం పనులు కూడ పూర్తి కాలేదు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. బీఆర్ఎస్ సర్కార్ పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతో రూ.25 కోట్లుతో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పట్టుబట్టి నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేశారు. దీంతో సెప్టెంబర్ 27న అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్థానిక నేతలతో కలిసి నర్సింగ్ కళాశాల పనులను ప్రారంభించారు.
ఐదు నెలలు గడిచినా సగం పనులు కూడా కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవు తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో పాటు సంబంధిత శాఖ అధికారులు నర్సింగ్ కళాశాల నిర్మాణాన్ని పరిశీలించి నాణ్యతతో వేగంగా పనులు జరిపిం చాలని విద్యార్థులు, స్థానికులు కోరుతున్నారు. అదే విధంగా బషీరాబాద్‌లో ఇంటర్ కళాశాలతో పాటు ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణాలకు శ్రీకారం చుట్టాలని కోరుతున్నారు. మరోవైపు యువత, విద్యార్థుల క్రీడల కోసం తాండూరు మండలం అంతారం సమీపంలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనులు కూడా ముందుకు సాగడం లేదు.
రెండేళ్ల క్రితం ప్రారంభమైన పనులు ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఉన్నా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దీంతో నియోజక వర్గంలోని విద్యార్థులు, యువత ఇండోర్ క్రీడలకు దూరమవుతున్నారు. మరో వైపు నియోజక వర్గం విద్యార్థులకు ఆటపోటీలు నిర్వహించేందుకు మినీ స్టేడియం కూడా అందుబాటులో లేక పోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుండడంతోనే పనులు నత్తనడకన కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికైన సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు నియోజకవర్గంలో నిలిచిన అభివృద్ధి పనులపై దృష్టి సారించి పూర్తి చేస్తే బాగుంటుందని నియోజకవర్గం ప్రజలు, యువతీయువకులు, విద్యార్థులు కోరుతున్నారు.