మొయినాబాద్, జూలై 9 : ప్రజా పాలనలో ఇదేమి గోస అని.. అన్నం పెట్టే రైతులపై దాష్టీకం తగదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి అన్నారు. దాదాపు 70 ఏండ్లుగా భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్న రైతులకు ప్రభుత్వం అన్యాయం చేయొద్దని.. వారికి న్యాయం చేసే వరకు పార్టీ అండగా ఉంటుందన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి, ఎన్కేపల్లి గ్రామ రెవెన్యూలో గల సర్వే నం.180 లోని 99.14 ఎకరాల ప్రభుత్వ భూమిని రైతులు సాగు చేసుకుంటుండగా సర్కారు దానిని గోశాలకు ప్రతిపాదించడంతో రైతులు గత రెండు రోజులుగా ఆ భూముల్లోనే రాత్రీపగలు కాపలాగా ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు.
కాగా, బుధవారం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో వారికి సంఘీభావం తెలిపి.. ఆ భూముల్లో సాగు చేసిన జొన్న పంటను పరిశీలించారు. మాకు సర్కారుతో మాట్లాడి న్యాయం చేయించాలని రైతులు వేడుకున్నారు. ఆందోళనకు దిగిన అన్నదాతలకు బీఆర్ఎస్ కొంత ఆర్థిక సాయాన్ని అందించింది.
సాగులో లేని భూములు గోశాలకు..
ఈ సందర్భంగా కొంపల్లి అనంతరెడ్డి మాట్లాడుతూ.. రైతులు భూమిని సాగులోకి తీసుకు రాకముందు అక్కడ పెద్ద అడవి ఉండేదని.. రాళ్లు, గుట్టలు ఉండేవని.. వాటిని తొలగించి.. గత 70 ఏండ్లుగా భూములను సాగు చేసుకుని దాదాపుగా 50 కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. ఆ భూములను ప్రభుత్వం గోశాలకు ప్రతిపాదించడం తగదన్నారు. గోశాల ఏర్పాటుకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదని.. అయితే, సాగులో లేని భూముల్లో దానిని నిర్మిస్తే తప్పేంటని సర్కారును ప్రశ్నించారు.
మొయినాబాద్ ప్రాంతం హైదరాబాద్‌కు ఆనుకుని ఉండడంతో విలువైన భూములను గోశాలకు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. రైతులు కోరిన విధంగా కాకుండా కంటి తుడుపుగా పరిహారమిచ్చి వారి భూములను తీసుకోవాలనుకోవడం దారుణమని, వారికి న్యాయం చేయాలని, అందుకు ఎకరానికి 1000 గజాల చొప్పున స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు వారిని ఇబ్బందిపెట్టేలా భయభ్రాంతులకు గురి చేయడం మంచిపద్ధతి కాదని హెచ్చరించారు.
ఏ సమయంలో తమ భూములను సర్కారు స్వాధీనం చేసుకుంటుందోనన్న ఆందోళనలో రైతులు రాత్రీపగలు అనే తేడా లేకుండా కంటిపై కునుకు లేకుండా భూముల వద్దే కాపలాగా ఉంటున్నారని.. ప్రజాపాలనలో అన్నం పెట్టే రైతులు కంటిమీద కునుకు లేకుండా సాగు భూముల వద్ద కాపలాగా ఉండాల్సిన దుస్థితి రావడం బాధాకరమన్నారు. అన్నదాతల పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరిని వీడి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీహరియాదవ్, రవూఫ్, సుధాకర్‌యాదవ్, జయవంత్, రాజు, కృష్ణారెడ్డి, నర్సింహగౌడ్, రాఘవరెడ్డి, శ్రీనివాస్, సురేందర్‌గౌడ్, రాము, పరమేశ్, ప్రవీణ్, మహేందర్‌రెడ్డి, దర్శన్, సత్తిరెడ్డి, రాజుగౌడ్, నర్సింహారెడ్డి, దాన్రెడ్డి, లక్ష్మీనారాయణ, రాజూగౌడ్, అజ్మత్ పాల్గొన్నారు.
భూములను బలవంతంగా తీసుకోవద్దు : సీపీఐ
రైతుల భూములను బలవంతంగా తీసుకోవాలన్నా ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి సూచించారు. తమ భూములను గోశాలకు ఇవ్వడాన్ని నిరసిస్తూ అన్నదాతలు గత రెండు రోజులుగా భూముల వద్ద నిరసన తెలుపుతుండగా.. బుధవారం సీపీఐ నాయకులు వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ.. గత 70 ఏండ్లుగా సాగు చేసుకుని జీవిస్తున్న రైతుల నుంచి భూములను పోలీసు పహారాలో తీసుకోవాలని చూడడం సర్కారుకు తగదన్నారు.
ప్రజా ప్రభుత్వమని చెప్పుకొనే కాంగ్రెస్ సర్కార్ అన్నదాతలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు. అన్యాయంగా భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తే సీపీఐ రైతుల తరఫున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం నాయకుడు, రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లా కార్యదర్శి ప్రభులింగం, సీపీఐ మొయినాబాద్ మండల కార్యదర్శి శ్రీనివాస్ , ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, బీకేఎం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, సీపీఐ శంకర్పల్లి మండల కార్యదర్శి సుధీర్, నాయకులు, ఎన్కేపల్లి పోరాట నాయకులు పాల్గొన్నారు.