పూడూరు, ఆగస్టు 12 : పంట పొలాల మధ్యలో ఉన్న మెస్సర్ సుందర్ సింథటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వివిధ రకాల రెసిన్ తయారు చేసే ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని మాజీ సర్పంచ్ రవి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 17/ఇ, 17ఎ, 17ఈ/1/1లో ఏర్పాటు చేసిన మెస్సర్ సుందర్ సింథటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టు విస్తరణకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.
ఈ కంపెనీ విస్తరణ వల్ల మరింత కాలుష్యంతో పశువులకు హానితో పాటు పంటల నష్టం జరుగుతుందని వ్యతిరేకించారు. ఆ పరిశ్రమ విస్తరణకు అనుమతులు ఇవ్వవద్దని పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తున్న వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్‌కు గ్రామస్తులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ విషయం మినిట్స్‌లో పొందు పరుస్తామని గ్రామస్తులకు అడిషనల్ కలెక్టర్ తెలిపారు.
అధికారులు కంపెనీ విస్తరణకు అనుమతులు ఇవ్వకుండా రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు విస్తరణ చేస్తే కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేస్తామని రైతులు హెచ్చరించారు. ప్రజాభిప్రాయ సేకరణ సభకు గ్రామస్తులు వెళ్లలేదు. ఆ పరిశ్రమ యాజమాన్యానికి అనుకూలంగా ఉన్న ఒకరిద్దరు గ్రామస్తులు, కొందరు ఎన్జీవోలు మాత్రమే హాజరయ్యారు. వారిలో కొందరు కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకించగా, మరికొందరు నిర్మాణం చేయాలని పేర్కొన్నారు.
ఈ సమావేశం డీఎస్పీతో పాటు సీఐ, ఎస్సైలతో సుమారుగా 100 మంది పోలీసుల బందోబస్తు మధ్యలో నిర్వహించారు. గత మే నెలలో నిర్వహించిన సమావేశాన్ని గ్రామస్తులు వ్యతిరేకించగా అధికారులు హాజరు కాకపోవడంతో రద్దు అయింది. ఈ కంపెనీ వల్ల కాలుష్యం ఏర్పడి పంటలు పండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ సమావేశంలో మాట్లాడుతూ గ్రామస్తులు, ఎన్జీవోల ఇచ్చిన సూచనలు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ భరత్‌కుమార్, జీఎం మహేందర్, గ్రామస్తులు సురేశ్, రాజు, అశోక్ ఉన్నారు.