షాద్‌నగర్, డిసెంబర్ 30 : ప్రైవేట్ దవాఖానాల్లో రోగుల నుంచి డబ్బులు తీసుకోవడం సహజం. కానీ షాద్‌నగర్ సర్కారు దవాఖానలో వైద్యం పొందాలంటే రూ.10 చెల్లించి ఓపీ చిట్టీ తీసుకోవాలి. లేకుంటే క్యూ లైన్లో నుంచి పక్కకు జరిగిపోవాలి. ఇది ఈ దవాఖానలో సిబ్బంది పెట్టుకున్న రూల్. కండ్ల ముందు బహిరంగంగా రోగుల నుంచి డబ్బులను వసూలు చేస్తున్నా స్థానికంగా ఉండే ఉన్నతాధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని బాధిత రోగులు వాపోతున్నారు. తాజాగా సోమవారం ఉదయం సాధారణ వైద్యం కోసం వచ్చిన రోగుల నుంచి డబ్బులు తీసుకుంటున్న వైనం మరోమారు బయటపడింది. వందల సంఖ్యలో రోగుల తాకిడి ఉండడంతో విధులు నిర్వహించే వైద్య సిబ్బంది ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. రూ.10 ఉంటేనే క్యూలో ఉండండి.. లేదంటే పక్కకు తప్పుకోండి అంటూ డబ్బులు వసులు చేశారు.
అందులో ఓ రోగి ఎక్కడా లేనివిధంగా డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారని సంబంధిత సిబ్బందిని ప్రశ్నించగా.. మాకు కూడా ఖర్చులుంటాయని.. మీకు ఓపీ చీటీ కావాలంటే డబ్బులు ఇవ్వండి.. లేకుంటే బయటకు వెళ్లండి అంటూ పెడసరిగా సమాధానమిచ్చారు. ఈ వ్యవహారంపై బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సర్కారు దవాఖానల్లో డబ్బులు వసూలు చేయడమేంటని, ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సంబంధిత దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా.. బాధిత రోగులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డబ్బులు తీసుకుంటున్నట్లు మీడియాలోనే చూశానని చెప్పారు. ఇదిఇలా ఉంటే సూపరింటెండెంట్ విధులు నిర్వహిస్తున్న గది పక్కనే సిబ్బంది డబ్బులు వసూలు చేస్తుండటం గమన్హారం.