రంగారెడ్డి, ఏప్రిల్ 19, (నమస్తే తెలంగాణ):పెద్ద తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకూ కొండంత అండగా నిలుస్తున్నది. ఈ పరిశ్రమలు తయారు చేసిన వస్తువులను భారీ పరిశ్రమలకు అందించగా వాటి డబ్బులు చేతికి రావాలంటే ఇదివరకు చాలా సమయం పట్టేది. దీంతో పెట్టుబడి లేక కొన్ని చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డ సంఘటనలు ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర సర్కార్ ఫెసిలిటేషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి, రంగారెడ్డి రీజియన్ కౌన్సిల్లో రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాలను చేర్చింది.
ఈ కౌన్సిల్‌కు రంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ అధికారి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. నాటి నుంచి కౌన్సిల్ నిబంధనల మేరకు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు సరఫరా చేసే వస్తువులకు భారీ పరిశ్రమలు 60 రోజుల్లో డబ్బులను అందజేస్తున్నాయి. చెల్లింపుల్లో ఆలస్యమైతే కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఇందులో భాగంగా గడిచిన రెండేండ్లలో 54 కౌన్సిల్ సమావేశాలు జరుగగా, 1520 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1054 దరఖాస్తులను పరిష్కరించి రూ.375 కోట్ల బకాయిలు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులకు అందేలా కౌన్సిల్ చొరవ తీసుకున్నది. ఇలా ఉత్తమ సేవలందించినందుకుగాను రంగారెడ్డి రీజియన్ కౌన్సిల్ జాతీయ అవార్డుకు ఎంపికైంది. నేడు ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో రంగారెడ్డి రీజియన్ చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డికి కేంద్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ తాతు రాణే అవార్డును అందజేయనున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగంలో నూతన శకం మొదలైంది. జిల్లాలో పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అనుకూలంగా ఉండటంతో నూతన పరిశ్రమల ఏర్పాటుకు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఎన్నో ఇండస్ట్రియల్ పార్కులు, హార్డ్‌వేర్ పార్కులు, ఐటీ టవర్స్, మెగా ఉత్ప త్తి పరిశ్రమలతోపాటు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి.
ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభు త్వం తీసుకొచ్చిన టీఎస్-ఐపాస్‌తో పారిశ్రామిక రంగం లో చాలా మార్పు వచ్చింది. గతంలో ఓ భారీ పరిశ్రమ ను ఏర్పాటు చేయాలంటే ఆరు నెలల వరకు సమయం పట్టేది. అంతేకాకుండా అనుమతి వస్తుందా ..? లేదా అనేది కూడా నమ్మకం ఉండేది కాదు. కానీ టీఎస్-ఐపాస్ విధానంతో ఎంత పెద్ద భారీ పరిశ్రమ ఏర్పాటుకైనా కేవలం పదిహేను రోజుల్లోగా అనుమతులు లభిస్తుండటంతో అధిక మొత్తంలో కొత్త సంస్థల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. భారీ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవసరమయ్యే మౌలిక వసతులను కల్పించడంతోపాటు అండగా నిలుస్తున్నది.
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు అండగా కౌన్సిల్
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తున్నది. ఇందుకోసం సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల ఫెసిలిటేషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి రీజియన్, వరంగల్, మేడ్చల్, కరీంనగర్ రీజియన్లలో ఫెసిలిటేషన్ కౌన్సిళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రంగారెడ్డి రీజియన్‌లో రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలున్నాయి. అయితే సంబంధిత ఫెసిలిటేషన్ కౌన్సిల్‌కు రంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ అధికారి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా రంగారెడ్డి రీజియన్ ఫెసిలిటేషన్ కౌన్సిల్‌కు జాతీయ స్థా యి అవార్డు దక్కింది. బుధవారం ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరుగనున్న కార్యక్రమంలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా రంగారెడ్డి రీజియన్ చైర్మ న్ రాజేశ్వర్‌రెడ్డి అవార్డును అందుకోనున్నారు.
ఇప్పటివరకు రూ.375 కోట్ల బకాయిల వసూలు
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులు కొనుగోలుదారులకు వస్తువులు లేదా సేవలను అందిస్తే దానికి రావాల్సిన డబ్బులను 45 రోజుల్లోగా వసూలు చేసుకోవాలి. నిర్ణీత గడువులోగా డబ్బులు రాకుంటే ఫెసిలిటేషన్ కౌన్సిల్లో ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు అనంతరం సంబంధిత కొనుగోలుదారులకు కౌన్సిల్ ఫిర్యాదును అందజేస్తుంది. అందిన 15 రోజుల్లోగా డబ్బులను చెల్లించకపోతే ఇరువర్గాలకు నోటీసులు జారీ చేసి కౌన్సిల్లో చర్చిస్తారు. అయినప్పటికీ కొనుగోలుదారులు చెల్లించకుండా ఉన్నత న్యాయస్థానానికి వెళ్తే ముం దుగానే 75 శాతం బకాయి డబ్బును కోర్టుకు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఏర్పాటైన అనంతరం భారీ పరిశ్రమల నిర్వాహకులు 60 రోజుల్లోనే సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులకు డబ్బులను అందజేస్తున్నారు, ఒకవేళ ఆలస్యమైతే వడ్డీ తో కలిపి చెల్లిస్తున్నారు. కాగా రెండేండ్లలో ఇప్పటివరకు 54 కౌన్సిల్ సమావేశాలు జరుగగా, 1,520 దరఖాస్తు లు వచ్చాయి. అయితే 1,054 దరఖాస్తులను పరిష్కరించగా.. రూ.375 కోట్ల బకాయిలను సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులకు వసూలయ్యాయి. వచ్చిన దరఖాస్తుల్లో 69.34 శాతం మేర పరిష్కారమయ్యాయి.
సూక్ష్మ,చిన్నతరహా పరిశ్రమలకు భరోసా వచ్చింది
ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఏర్పాటుతో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులకు భరోసా ఏర్పడింది. కౌన్సిల్ ఏర్పాటుతో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నుంచి వస్తువులు, సేవలను పొందే భారీ, ఇతర పరిశ్రమల నిర్వాహకుల్లో భయం ఏర్పడింది. నిర్ణీత గడువులోగా వారే బకాయిలను చెల్లిస్తున్నారు. రీజియన్ పరిధిలో పెండింగ్ బకాయిలుంటే సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులు నేరుగా కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయొచ్చు.
– రాజేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి రీజియన్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ చైర్మన్
నేరుగా ఫిర్యాదు చేస్తున్నాం
గతంలో మా సమస్యలను ఎవరూ పట్టించుకోలేదు. ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఏర్పాటుతో మాకు సరైన ప్లాట్ ఫాం దొరికింది. పెండింగ్ బకాయిలకు సంబంధించి నేరుగా ఫిర్యాదు చేస్తున్నాం. నిర్ణీత గడువులోగా మాకు డబ్బులు అందుతున్నాయి. మా పరిశ్రమకు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న రూ.10 లక్షల బకాయి లు ఫెసిలిటేషన్ కౌన్సిల్ జోక్యంతో 15 రోజుల్లో వసూలయ్యాయి.
– షాలినీఅగర్వాల్, నీమస్ ఎంటర్ప్రైజెస్ పరిశ్రమ