Nandanavanam | జవహర్‌నగర్, మార్చి 13: దాడులకు భయపడం… గుండాలకు బెదరం… కాంగ్రెస్ వస్తే పేదలకు మేలు చేస్తదనుకుంటే… ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చూస్తుందని, ఎట్టి పరిస్థితిలో నందనవనం పార్కును కబ్జా కాకుండా ప్రాణాలను పణంగా పెట్టైన కాపాడుకుంటామని ఆనంద్‌నగర్ కాలనీవాసులు హెచ్చరించారు.
జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని 15వ డివిజన్లోని సర్వే నెం. 510, 17గుంటల స్థలాన్ని నందనవనం పార్కుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చదిద్దిన 4ఏళ్ళ తర్వాత కబ్జా చేద్దామని ప్రయత్నిస్తూ కాలనీవాసులపై దాడికి పాల్పడిన తీరును నిరసిస్తూ ఆనందన్‌నగర్ కాలనీవాసులు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆనంద్నగర్కాలనీవాసులు మాట్లాడుతూ.. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని సర్కారు స్థలాలను కొల్లగొట్టిందే కాకుండా ప్రజలకు కేటాయించి వినియోగంలో ఉన్న నందనవనం పార్కును కబ్జాచేయాలని చూడటం దుర్మార్గమని, కబ్జాదారులకు వణుకుపుట్టేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రూ. 35లక్షలతో పార్కును సుందరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిదిద్దితే కాంగ్రెస్ ఖతం చేయాలని చూస్తుందని, కాంగ్రెస్ పెద్దలారా మీకు చిత్తశుద్ధి ఉంటే పార్కు స్థలాన్ని కాపాడి చూపించాలని సవాల్ విసిరారు. కబ్జాదారులకు ప్రభుత్వం వత్తాసు పలికితే జవహర్‌నగర్ కార్పొరేషన్లో గుంటభూమైనా మిగిలేలా లేదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పుష్పలత, ఐలమ్మ, లత, జయ, రత్నా, బాలమణి, శోభ, శ్వేత, భవాని, సరితా, మౌనిక, శ్రీకాంత్‌యాదవ్, వినయ్, రవీందర్‌రెడ్డి, రాజు, సందీప్, దేవేందర్, రాంబాబు, బ్రహ్మచారి, విశాల్, మధు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.