లగచర్ల ఘటనలో అరస్టైన వారికి బెయిల్ మంజూరైంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో సహా మరో 24 మందికి బుధవారం నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మం జూరు చేయడంతో రోటిబండతండా, పులిచెర్లకుంటతండా, లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల్లోని బాధిత కుటుంబాల సభ్యులు, రైతుల్లో ఆనందం వెల్ల్లివిరిసింది. గత నెల 11వ తేదీన ఫార్మా విలేజ్ భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం లగచర్ల వెళ్లిన అధికారులను రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే.. కాగా, అదే రోజు అర్ధరాత్రి వారి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. కరెంట్ సరఫరా నిలిపివేసి, ఇంటర్నెట్ సేవలను బంద్ చేసి ఇల్లిల్లూ జల్లెడపట్టారు.
చిన్నారులు, మహిళలు, వృద్ధులు అని చూడకుండా దౌర్జన్యంగా వ్యవహరించారు. ఆడ, మగ అనే తేడా లేకుండా దొరికిన వారిని దొరికినట్లుగా వ్యాన్లలో కుక్కి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆనాటి నుంచి ఆ 5 గ్రామాలు పూర్తిగా నిర్మానుష్యంగా మారి, బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి. అరస్టై జైలులో ఉన్న వారి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియక కుటుంబీకులు తిండి, నిద్ర మాని వారి కోసం ఎదురుచూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశాయి. కాగా, బుధవారం నాంపల్లి స్పెషల్ కోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేయడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం నిండింది.
తమ వారి కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు న్యాయం గెలిచిందని.. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ బాధిత కుటుంబాల సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేకు బెయిల్ రావడంతో నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ఆనందంతో సంబురాలు జరుపుకొంటున్నారు. 36 రోజులుగా నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఎంతో బాధతో ఉన్నామని, బెయిల్ మంజూరు కావడంతో వారు కడిగిన ముత్యంలా బయటికి వస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.
– కొడంగల్, డిసెంబర్ 18
నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని తెలియడంతో ఇంట్లోని అందరం సంతోషపడ్డాం. ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నాం. జైలుకెళ్లిన నాటి నుంచి మా ఆయన ఎట్టా ఉన్నాడో తెలియక చాలా బాధగా ఉండేది. ఆయన ఆరోగ్యం కూడా బాగా లేదు. తొందరగా ఇంటికి రావాలని ఎన్నో దేవుళ్లను మొక్కుకున్నా.
-సుమిత్రాబాయి, రోటిబండతండా, దుద్యాల మండలం
లగచర్ల ఘటనలో తన కుమారుడిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి జైల్లో వేశారు. అప్పటి నుంచి సరిగ్గా తినడంలేదు.. కంటికి నిద్రలేదు. ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నా. బుధవారం బెయిల్ మంజూరైందని తెలియడంతో సంతోషంగా ఉన్నది. ఒక్కగానొక్క కొడుకు ఏమైపోతాడో అనే భయంగా ఉండేది. మాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు.
– సుశీలాబాయి, రోటిబండతండా, దుద్యాల మండలం
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బుధవారం లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కడ్తాల్ మాజీ జడ్పీటీసీ దశ రథ్నాయక్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. కడ్తాల్ మండలంలో పర్యటించాలని కోరారు.
కడ్తాల్,డిసెంబర్ 18