ఆదిబట్ల, జూన్ 8 : దశలవారీగా ఆదిబట్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి 2వ వార్డు వేదపురి కాలనీలో రూ.7లక్షలతో, 11వ వార్డు బాలాజీనగర్ కాలనీలో రూ.15లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిబట్ల మున్సిపాలిటీకి మరిన్ని నిధులు తీసుకువచ్చి రాష్ట్రంలోనే నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ అభివృద్ధిలో వెనుకబడి పోయిందన్నారు.
రానున్న రోజుల్లో ప్రభుత్వంతో కొట్లాడి మరిన్ని నిధులు తీసుకువస్తానన్నారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయడానికి ప్రణాళిక ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధిపై చర్చిస్తామని పేర్కొన్నారు. కేవలం ఎన్నికల ముందే రాజకీయాలు చేయాలని.. తరువాత ప్రతిఒక్కరూ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ యాదగిరి, కౌన్సిలర్లు మౌనిక, అర్చన, ఏఈలు వీరాంజనేయులు, జాన్సన్, నాయకులు రాంరెడ్డి, ఉదయపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్, రామారావు, ప్రభాకర్‌రెడ్డి, కృష్ణ, పాండుగౌడ్, ప్రవీణ్‌గౌడ్, కాలనీల పెద్దలు పాల్గొన్నారు.