Vikarabad | జిల్లాలో కరెంట్ బిల్లులు మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి కష్టంగా మారిన పేద, మధ్యతరగతి ప్రజల బతుకులు.. విద్యుత్తు బిల్ కలెక్టర్ల నిర్లక్ష్యంతో వచ్చిన అధిక విద్యుత్తు బిల్లులను చూసి వారు లబోదిబోమంటున్నారు. జూన్ నెలకు సంబంధించి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో భారీగా కరెంట్ బిల్లులొచ్చాయి. గతంలో వచ్చే విద్యుత్తు బిల్లులతో పోలిస్తే జూన్ నెలకు సంబంధించి రెండింతలు, మూడింతలు పెరుగడం గమనార్హం. బిల్ కలెక్టర్లు విద్యుత్తు బిల్లులను నెలరోజులకు కాకుండా 40-45 రోజుల మధ్య తీస్తుండడంతో స్లాబ్‌లు మారి భారీగా కరెంట్ బిల్లులు వస్తున్నాయని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లితోపాటు పలు కాలనీల్లో భారీగా వచ్చిన కరెంట్ బిల్లులను నుంచి వినియోగ దారులు షాక్‌కు గురవుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ వినియోగదారుడికి మే నెలకు సంబంధించి రూ.297 విద్యుత్తు బిల్లురాగా, జూన్ నెలకు రూ. 546 వచ్చింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్తు బిల్ కలెక్టర్ల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
– వికారాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ)
రూ.7,37,440.. ఇది ఓ పరిశ్రమకో.. ఓ బహుళ జాతి సంస్థకు సంబంధించి 30 రోజుల కరెంట్ బిల్లు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈ బిల్లు ఐదు బల్బులున్నా పేద కుటుంబం నివాసముంటున్న ఓ ఇంటికి వచ్చింది. వికారాబాద్ మండలంలోని సిద్దులూరు గ్రామ పంచాయతీకి చెందిన ఇంటినంబర్ 2-7/1 ఎన్కెపల్లి గోపాల్‌కు జూన్ నెలకు సంబంధించి రూ.7,37,440 విద్యుత్తు బిల్లు వచ్చింది. ప్రతినెలా రూ.100 లోపు వచ్చే బిల్లు ఈ నెలలో ఒకేసారి రూ.లక్షల్లో రావడంతో గోపాల్ షాక్‌కు గురయ్యాడు. ఈ విషయం ఊరంతా తెలిసి సోషల్ మీడియాలో శుక్రవారం రాత్రి నుంచి వైరల్ అయ్యింది. అప్రమత్తమైన విద్యుత్తు శాఖ అధికారులు శనివారం మధ్యాహ్నం బిల్లును ఆ సైట్ నుంచి తొలగించారు.