శంకర్పల్లి, జూలై 29 : త్యాగానికి ప్రతీక మొహర్రం అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం మొహర్రం సందర్భంగా మండలంలోని కొండకల్ గ్రామంలో పీర్లకు దట్టీలు కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రభుత్వం అన్ని మతాలకు సమప్రాధాన్యం ఇస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పాపారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ రాజూనాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్ పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్: మత సామరస్యానికి ప్రతీక మొహర్రం అని నాయకులు, ప్రజాప్రతినిధులు అన్నారు. పలువురు పీర్లకు దట్టీలను సమర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వై నియోజకవర్గ ప్రధానకార్యదర్శి జీవన్‌కుమార్‌రెడ్డి, మండల అధ్యక్షుడు వినయ్‌కుమార్‌రెడ్డి, నాయకులు ఎండీ ఇమ్రాన్, కొండల్‌గౌడ్, శివ, సందీప్, హరీశ్, శివశంకర్, అరుణ్, సాయికిరణ్ ఉన్నారు.
కడ్తాల్ : మండల వ్యాప్తంగా మొహర్రాన్ని నిర్వహించారు. శుక్రవారం రాత్రి గ్రామాల్లో పీర్ల ఎదుట యువకులు పెద్ద ఎత్తున అలావ్ వద్ద ఉత్సాహంగా చిందేశారు. పీర్లకు పూలు, దట్టిలు సమర్పించారు. పీర్లను గ్రామాల్లోని ప్రధాన వీధులగుండా ఊరేగించి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం పీర్లను స్థానిక చెరువులలో నిమజ్జనం చేశారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : హిందూ, ముస్లింలు మొహర్రాన్ని నియోజకవర్గంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఇమామ్ హుస్సేన్ త్యాగానికి ప్రతీకగా జరుపుకొనే మొహర్రాన్ని తొమ్మిది రోజులుగా పీర్ల చావడిలో పీర్లను ప్రతిష్ఠించి ప్రార్థనలు నిర్వహించారు.
యాచారం : త్యాగానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రాన్ని మండలంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులుగా పీర్ల చావడిలో పీర్లను ప్రతిష్ఠించి ప్రత్యేక ప్రార్థ్ధనలు నిర్వహించారు. ప్రతి రోజు గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. రాత్రిపూట పీర్ల ముందు ఏర్పాటు చేసిన అగ్నిగుండం చుట్టూ పిల్లలు, పెద్దలు, యువకులు కుల, మత భేదాలు లేకుండా ఆటాపాటలతో ఎంజాయ్ చేశారు. మొహరం రోజున పీర్లను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
మొయినాబాద్ :వివిధ గ్రామాల్లో హిందువులు, ముస్లింలు మొహర్రాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. పీర్లను గ్రామాల్లో ఊరేగించారు. ప్రజలు పీర్లకు దట్టీలు, ఊదు, బెల్లం సమర్పించుకుని శనివారం మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో పీర్లను డప్పుల దరువుల మధ్య ఊరేగించారు. పాటలు పాడుకుంటూ అలావ్ ఆడుతూ వేడుకలు జరుపుకొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : షాద్‌నగర్ మున్సిపాలిటీలోని ఫరూఖ్‌నగర్‌లో శనివారం రాత్రి మొహర్రాన్ని హిందూ, ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. పీర్లను ఊరేగించారు. పీర్లకు కుడకలు, మాలింగ ముద్దలను, షర్బత్‌ను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
షాబాద్ మండలంలో..
షాబాద్ : షాబాద్ మండలంలో పీర్ల పండుగ(మొహర్రం)వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. కులమతాలకు అతీతంగా శనివారం మండలంలోని కుమ్మరిగూడ, తాళ్లపల్లి, షాబాద్, బోడంపహాడ్, మన్మర్రి, బొబ్బిలిగామ, నాగరకుంట, హైతాబాద్, సోలీపేట్ తదితర గ్రామాల్లో పీర్లను ఊరేగింపు చేపట్టారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.