శంకర్పల్లి, ఫిబ్రవరి 7 : పదవుల కోసం పార్టీలు మారే నాయకులకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శంకర్‌పల్లిలోని 2, 3, 4, 5, 7, 9, 11, 13, 14, 15 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఆమె శనివారం ప్రచారం నిర్వహించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఏ ఒక్క రంగంలోనూ గణనీయమైన అభివృద్ధి జరగలేదని, మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు. ఎక్కడ చూసినా కేసీఆర్ అమలు చేసిన తాగునీరు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయని ప్రజలే చెబుతున్నారని తెలిపారు. నల్లానీరు వచ్చే వరకు ఓట్లు అడగనని చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. హైదరాబాద్‌లో ప్రజలు తాగుతున్న నీటినే గ్రామాల్లోనూ అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో ప్రతి రంగం అధోగతిపాలైందని ఆరోపించారు. సర్కారుకు బుద్ధి రావాలంటే ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కేసీఆర్ హయాంలో పంటలకు అదనంగా 10వేలు అందించామని, కాని ప్రస్తుత ప్రభుత్వం మూడుసార్లు రైతు బంధు ఎగ్గొట్టిందని ఆరోపించారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పి, పెళ్లి తర్వాత కూడా కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయలే ఇస్తున్నదని విమర్శించారు. రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. నమ్మి ఓటేసిన ప్రజలను రేవంత్ సర్కార్ నిండా ముంచిందని ఆరోపించారు. కాంగ్రెస్ అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు తదితరాలు బాకీ కార్డుల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి ఇచ్చిన హామీలను గాలికొదిలేసి కాంగ్రెస్ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నదో అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, మాల చిన నర్సింహులు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శశిధర్‌రెడ్డి, నాయకుడు ఉపేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.