చేవెళ్ల రూరల్, మే 10 : సాధ్యం కాని హామీలిచ్చి.. వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు మద్దతుగా ఎమ్మెల్యే కాలె యాదయ్య తంగడిపల్లి, అనుబంధ గామం మడికట్టు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో లేని తాగు, సాగునీరు, కరెంట్ కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ మొదలయ్యాయన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణకు అన్ని అంశాల్లో అన్యాయం చేసిందని, అధికంగా ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 96 బీసీ కులాలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన బీసీ బంధు, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, గొప్ప సంఘ సంస్కర్త కాసాని జ్ఞానేశ్వర్‌ను పార్లమెంట్‌కు పంపితే మన ప్రాంత సమస్యల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

కాసానిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, బీఆర్ఎస్ బీసీ సెల్ మండలాధ్యక్షుడు, మాజీ సర్పంచ్‌లు, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీపీ, కురుమ సంఘం మండల అధ్యక్షుడు, మారెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్, మారెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు, మాజీ ఉప సర్పంచ్‌లు, మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు, బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ కార్యకర్తలున్నారు.
కడ్తాల్ : అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే అబద్ధాలను నమ్మి ప్రజలు ఆగం కావొద్దని, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతుగా.. శుక్రవారం మండల పరిధిలోని చరికొండ, ముద్విన్ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, జడ్పీటీసీలు దశరథ్‌నాయక్, ఉప్పల వెంకటేశ్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో జైపాల్‌యాదవ్ మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని తెలిపారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడంలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు కల్లబొల్లి మాటలతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి గ్రామాల్లో తిరుగుతున్నారని, వారు చెప్పే మాటలను నమ్మి గోస పడవద్దన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు బాగుపడ్డారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు.
రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు చేస్తలేరని, రైతుబంధు రూ.15వేలు, రూ.4 వేల పింఛన్ ఎందుకు ఇవ్వడంలేదని, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఎక్కడికి పోయిందని, యువతులకు స్కూటీలు, మహిళలకు రూ.2,500 ఎందుకు ఇస్తలేరని ఆయన ప్రశ్నించారు. అబద్ధాలకు చిరునామాగా కాంగ్రెస్ పార్టీ మారిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతాంగం ఆగమైందని తెలిపారు. విద్యావంతుడు, ఈ ప్రాంత ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు, నాయకులున్నారు.

తుర్కయాంజాల్ : అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలల్లో ప్రజలే గట్టి గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి కొహెడలో భువనగిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొహెడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలకు కష్టాలు మొదలయ్యాయన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన క్యామ మల్లేశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎంపీగా చేస్తే ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి కేంద్రం నుంచి పెద్దఎత్తున నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రైతు బంధు సమితి రంగారెడ్డి జిల్లా మాజీ చైర్మన్, కౌన్సిలర్ జ్యోతి, నాయకులు పాల్గొన్నారు.
మంచాల : కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని.. నిరంతరం ప్రజల పక్షాన ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి ఆరుట్ల గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ ప్రజల గురించి పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో పదేండ్లలో అర్హులందరికి అనేక సంక్షేమ పథకాలు అందజేసి వారికి అండగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.