వికారాబాద్, జూన్ 23 : నిరుద్యోగ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ ఫంక్షన్ హాల్లో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ముందుగా ఆయన జడ్పీచైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో కలిసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేళాలో 70 కంపెనీల్లో 5000 ఉద్యోగాలకు ఏడోతరగతి నుంచి పీజీ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏండ్లలోపు వయసు గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా శాసనసభా పతి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందు కే మెగా జాబ్‌మేళాను నిర్వహించడం జరిగిందన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే 30 వేల ఉద్యోగాలను కల్పించడం జరిగిందని.. మరో 1.70 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో కడ (కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ) ద్వారా పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా ముమ్మర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చడంతోపాటు ఐదేండ్లలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామన్నారు.
అనంతరం జడ్పీచైర్‌పర్సన్ సునీతామ హేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతకు మెగా జాబ్‌మేళా ఎంతగానో దోహదపడుతుందన్నారు. యువత ఉద్యోగాల్లేవని చింతించకుండా వ్యవసాయ రంగంలో రాణించాలని సూచించారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ యువత విద్యతోపాటు తమలోని ప్రతిభనూ మెరుగుపరచుకోవాలన్నారు. యువత ఉద్యోగాలు సాధించి తమ కుటుంబాలకు అండగా ఉండాలని సూచించారు. మెగా జాబ్‌మేళాలో ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులకు శాసనసభాపతి ప్రసాద్‌కుమార్ నియామకపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజులారమేశ్, ఎంపీపీ చంద్రకళ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, వేణుగోపాల్ రావు, జడ్పీ సీఈవో సుధీర్, డీవైఎస్వో హనుమంతరావు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.