బషీరాబాద్, జూన్ 26 : వెనుకబడిన బషీరాబాద్ మండలానికి అధిక నిధులు కేటాయించి అన్ని విధాల అభివృద్ధి చేశామని జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ అధ్యక్షతన బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2006 నుంచి తనకు బషీరాబాద్తో అనుబంధం ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. మండల అభివృద్ధికి జడ్పీ నిధులు అత్యధికంగా కేటాయించినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి మాట్లా డుతూ విద్యాపరంగా మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు.
పాఠశాలలు ప్రారం భంలోనే విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మండలంలో జూనియర్ కాలేజీ లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదు ర్కొన్నారని, ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీ ఏర్పాటు చేసి తరగతులు ప్రారంభించినట్లు తెలిపారు. కళాశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలోని బాలికల పాఠశాలకు సైన్స్ ల్యాబ్, అదనపు గదుల నిర్మాణానికి ఇప్పటికే రూ.27లక్షల నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు.
మండలం లోని అన్ని పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ చేస్తామన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో పని చేస్తుందన్నారు. అనంతరం 60 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను జడ్పీ చైర్ పర్సన్‌తో కలిసి పంపిణీ చేశారు. చివరి సర్వసభ్య సమావేశం కావడంతో ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, వైస్ ఎంపీపీ అన్నపూర్ణ, తహసీల్ధార్ వెంకటేశ్, ఎంపీడీవో రాఘవులు, ఎంపీవో రమేశ్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.