రంగారెడ్డి, ఏప్రిల్ 4, (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన దీక్షలు, ధర్నాలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హోరెత్తింది. ఆయా మండల కేంద్రాల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాలకు రైతులతో పాటు గులాబీ దండు పెద్ద ఎత్తున తరలివచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో మండల కేంద్రాలు దద్దరిల్లాయి. మహేశ్వరం మండల కేంద్రంలో జరిగిన దీక్షలో మంత్రి సబితారెడ్డి పాల్గొనగా, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. రెండు పంటల వరి ధాన్యాన్ని కొని తీరాల్సిందేనని, లేదంటే కొనేదాక ఉద్యమిస్తామని హెచ్చరించారు. అన్నదాతల శ్రేయస్సే తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమని, వారి ప్రయోజనాల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రైతులను నట్టేట ముంచేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనబోమని చెబుతుండగా, రాష్ట్ర బీజేపీ నాయకులు వరి వేయండి.. కొనుగోలు చేసేలా చూస్తామని చెప్పడం ఏమిటని… ఇలాంటి ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్న బీజేపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని హెచ్చరించారు.
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్టీ పోరును షురూ చేసింది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు, ధర్నాలు చేపట్టారు. మహేశ్వరం మండల కేంద్రంలో తలపెట్టిన నిరసన దీక్షలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో చేపట్టిన నిరసన దీక్షలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొనగా, ఫరూఖ్‌నగర్, కొత్తూర్ మండల కేంద్రంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఆమనగల్లు మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చి రైతులకు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పలు మండల కేంద్రాల్లో నిరసన దీక్షలతోపాటు రహదారిపై ధర్నాలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ పంజాబ్ తరహాలో రెండు పంటలు రైతుల నుంచి కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా రైతులు నష్టపోవద్దని ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. కేంద్రంపై పోరులో భాగంగా ఈనెల 6న జాతీయ రహదారులను దిగ్బంధం చేసి రాస్తారోకో చేయనున్నారని పేర్కొన్నారు. ఈ నెల 7న జిల్లా కేంద్రంలో జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం, 8న ప్రతీగ్రామంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడంతోపాటు రైతుల ఇంటిపై నల్లజెండాలతో నిరసన తెలపడం, 11న ఢిల్లీలో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష పట్టనున్నట్లు తెలిపారు.
కేంద్రం వడ్లు కొనాల్సిందే..
పరిగి, ఏప్రిల్ 4 : రైతులు యాసంగిలో పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం వికారాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. వికారాబాద్, ధారూర్‌లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, తాండూరు మండలం గౌతాపూర్‌లో ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, తాండూరు, యాలాల్, బషీరాబాద్, పెద్దేముల్లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, పరిగి, కులకచర్లలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్‌రెడ్డి, కొడంగల్, దౌల్తాబాద్‌లో ఎమ్మెల్యే పి.నరేందర్‌రెడ్డి నిరసన దీక్షలలో పాల్గొన్నారు.
అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు, పార్టీకి చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొని కేంద్రం వడ్లు కొనుగోలు చేసేంత వరకూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. కేంద్రం వడ్లు కొనుగోలులో తెలంగాణపై వివక్ష చూపిస్తుందని, కేంద్ర మంత్రి అవహేళనగా మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లేనని వారు తెలిపారు. ఈ సందర్భంగా అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ శ్రేణులతోపాటు రైతులు నిరసన దీక్షలో పాల్గొన్నారు.