వికారాబాద్, సెప్టెంబర్ 6 : స్పీకర్ పదవికి రాజీనామా చేసి..పాలిటిక్స్ చేయండి అని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అయ్యా స్పీకర్ గారూ! మీకో దండం.. ‘రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే మన వికారాబాద్ జిల్లానే విద్యారంగంలో అట్టడుగున ఉన్న సంగతి మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధ్యాయులకు చెప్పాల్సింది.. విద్యార్థులకు మంచిగా చదువు చెప్పి, మన జిల్లాను అగ్రగామిగా నిలపాలని.. కానీ, మీరు చేసిందేమిటని మండిపడ్డారు.
విద్యార్థులకు పాఠా లు చెప్పి ప్రయోజకులను చేయాలని చెప్పకుండా.. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పారంటే దానిని ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని’ పేర్కొన్నారు. మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి, ఇలా కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మీకు ఆ పార్టీపై ప్రేమ ఉంటే, స్పీకర్ పదవికి రాజీనామా చేసి, దర్జాగా కాంగ్రెస్ తరఫున రాజకీయాలు చేసుకోవాలని.. అంతేకానీ స్పీకర్ పదవిలో ఉండి.. ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడి, స్పీకర్ పదవికి మచ్చ తెస్తున్నారన్నారు.