యాచారం, మే 21 : మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో ఫార్మా బాధిత రైతులు, వ్యవసాయ కూలీలు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం సమావేశమయ్యారు. ఫ్యూచర్ సిటీ వద్దని, మా భూములు మాగ్గావాలని, ప్రాణాలు పోయినా భూములిచ్చేదిలేదని నినాదాలు చేశారు. భవిష్యత్ కార్యాచరణపై రైతులు, కూలీలు, నాయకులు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి అధ్యక్షతన చర్చించారు.
యాచారం, మే21: మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో ఫార్మా బాధిత రైతులు, వ్యవసాయ కూలీలు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం సమావేశమయ్యారు. ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతుల సమస్యలను పరిష్కరించకుండానే భూములను స్వాధీనం చేసుకోవడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఫ్యూచర్‌సిటీ వద్దని, మా భూములు మాగ్గావాలని, ప్రాణాలు పోయినా భూములిచ్చేదిలేదని రైతులు నినాదాలు చేశారు. భవిష్యత్ కార్యాచరణపై రైతులు, కూలీలు, నాయకులు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయ కర్త కవుల సరస్వతి అధ్యక్షతన చర్చించుకున్నారు. ప్రస్తుతం ఫార్మా బాధిత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు రైతుల పొలాలను చదును చేయొద్దని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఫార్మాసిటిని రద్దు చేయకుండానే ఫ్యూచర్‌సిటి పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడంతో వారు మండిపడుతున్నారు.
ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఫార్మాసిటీ జీఓ 31ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తామని, రైతుల భూములను రైతులకు ఇస్తామని కపట హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నిలువునా మోసం చేసిందని వారు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో కలిసి పాదయాత్ర చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తమకు పదువులు రాగానే రైతులను విస్మరించారని పేర్కొన్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీకి భూములు ఇవ్వొద్దపని రైతులను రెచ్చగొట్టిన కాంగ్రెస్ నాయకులు నేడు ఫ్యూచర్‌సిటీకి భూములివ్వాలని రైతులను బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇది ఎంతవరకు సమంజసమని వారు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. కూలీల స్టే ఆర్డర్ ఉండగా పోలీసుల సహకారంతో అదికారులు, టీజీఐఐసీ అధికారులు బలవంతంగా రైతుల పొలాల్లోకి వచ్చి బోర్లు, పశువుల కొట్టాలు, పశుగ్రాసం జేసీబీలతో ధ్వంసం చేయడం ఎంతో దారుణమని వారు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. వ్యవసాయ భూముల్లో పొట్టదశలో ఉన్న వరిపంటకు అక్రమంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. తమ పొలాల్లో ఎలాంటి పనులు చేయొద్దని పనులు అడ్డుకుంటున్న రైతులను పోలీసులు అత్యుత్సాహంతో అక్రమంగా అరెస్టు చేయడం చట్టవిరుద్దమన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టడం, బలవంతంగా భూములు గుంజుకోవడమే ప్రజాపాలనా అంటూ వారు మండిపడ్డారు. అన్నదాలకు అన్యాయం చేస్తున్న ఫ్యూచర్‌సిటీ వద్దని వారు వ్యతిరేకించారు. రైతులకిచ్చిన హామీలు నెరవేర్చకుండానే తమ భూములను ఎలా స్వాదీనం చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, ఏసీపీ రాజు, ఫార్మా పీఎస్ సీఐ సత్యనారాయణ ప్రభుత్వానికి తొత్తులుగా మారి కోర్టు ధిక్కారినికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.
భూములను స్వాధీనం చేసుకునే ముందు ఫార్మాకు ఇవ్వని 2250ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి వెంటనే ఆన్లైన్లో రైతుల పేర్లను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు తమ భూములను అమ్ముకునేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ హక్కులు, ఇతర హక్కులను కల్పించాలని, అట్టి భూములకు రైతుభరోసా పంటరుణాలు ఇవ్వాలన్నారు. రైతులకు ఇస్తామన్న ఎకరాకు 121గజాల ఇంటి స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోర్టు కేసులు ఉన్న భూములను చదును చేయొద్దని అధికారులకు సూచించారు. ఫార్మాకు ఇవ్వని భూముల జోలికి వస్తే ఊరుకునేదిలేదని హెచ్చరిస్తున్నారు. భూములను స్వాధీనం చేసుకుంటున్న తరుణంలో రైతుల బోర్లు, పశువుల కొట్టాలు, పశుగ్రాసం ధ్వంసం చేస్తే నష్టానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట చేనుకు కరెంట్రు కట్ చేయొద్దని సూచించారు. ముఖ్యంగా ఫార్మా కంపెనీలు మండలంలో ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేశారు. గిరిజన పట్టా భూముల నుంచి వేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డును రద్దు చేయాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం చేపడుతున్న చట్ట వ్యతిరేక పనులను నిలిపివేయాలి, లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయ కర్త కవుల సరస్వతి, గణేష్, కొండల్‌రెడ్డి, పాండురంగాచారి, అచ్చిరెడ్డి, కుమార్, లింగం, వెంకటేష్, పాపిరెడ్డి, మహిపాల్‌రెడ్డి, రవీందర్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.