మియాపూర్ , మార్చి 30 : శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని చిత్తారమ్మ దేవాలయంలో ఏప్రిల్ 1 వ తేదీన శ్రీ లక్ష్మి అమ్మవారి పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రజలందరి సుభిక్షం కోసం మహా లక్ష్మి యాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు యాగ నిర్వహణ కమిటీ ప్రకటించింది. తిరుపతి వేద పండితుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలతో నిర్వహించనున్న యాగానికి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కమిటీ ప్రతినిధులు మహాలక్ష్మీ యాగానికి సంబంధించిన కరపత్రాలను చిత్తారమ్మ ఆలయ ప్రాంగణంలో సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు వడ్డేపల్లి రాజేశ్వర్రావు మాట్లాడుతూ.. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి మహాలక్ష్మి యాగం ప్రారంభమవుతుందని, 6.30 గంటలకు అమ్మవారి శోభాయాత్ర నిర్వహణ, 7.30 గంటలకు భూ సమేత లక్ష్మి వెంకటేశ్వర కళ్యాణం, కుంకుమార్చన, శ్రీ పుష్ప యాగంతో ముగుస్తుందని రాజేశ్వర్రావు తెలిపారు. 500 మహిళల సంప్రదాయ వస్త్ర ధారణతో 5 క్వింటాళ్ల పసుపు వినియోగంతో వేద మంత్రాల నడుమ ఈ మహాలక్ష్మి యాగ క్రతువు, శోభాయాత్రను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరికి ఆయురారోగ్యాలు, సకల శుభాలు కాంక్షిస్తూ నిర్వహించే యాగాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయాలని రాజేశ్వర్రావు కోరారు. యాగ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా చేపడుతున్నామన్నారు.