Clash | కేపీహెచ్బీ కాలనీ, జూలై 16: మద్యం తాగిన వ్యక్తులు రోడ్డుపై గొడవ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలోఓ వ్యక్తి తీవ్ర గాయాలై వైద్యశాలలో చికిత్స పొందుతున్న సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సెక్టార్ ఎస్ఐ మౌనిక రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రత్నాకర్ (29), సృజయ్ కాంత్ (28), సోదరులు హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీ కాలనీ 5వ పేజ్ లో నివసిస్తూ హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నారు.
జేఎన్టీయూహెచ్ రోడ్డులోని ఓ హోటల్లో హౌస్ కీపింగ్ పనులు చేసే కామేశ్వర్లు (24) ఈ ఇద్దరితోపాటు కలిసి మద్యం తాగాడు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో డీమార్ట్ వద్ద రోడ్డుపై హడావిడి చేస్తుండగా… కాలనీలో గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై ఎందుకు గొడవ చేస్తున్నారు ఇంటికి వెళ్లిపోమని సూచించారు. దీంతో గొడవ మొదలై ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.
ఈ ఘటనలో రత్నాకర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. తమ్ముడు సృజయ్ కాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.