NFC Nagar | ఘట్కేసర్, ఏప్రిల్ 3 : ఎన్ఎఫ్సీ నగర్లో మళ్లీ దొంగలు పడి వెండి ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్ఎఫ్సీ నగర్‌లోని ఓ రెండు ఇళ్లల్లో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. మరో రెండు నివాసాలలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించారు.
ఎన్ఎఫ్సీ నగర్ సీ-1 కాలనీలోని మన్మోహన్ ఇంటి తాళం పగులగొట్టి ఉండటంతో ఉదయం గమనించిన స్థానికులు మన్మోహన్‌కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి లోపలికి వెళ్లిచూడగా పూజ గదిలోని 10 తులాల వెండి పూజాసామాగ్రిని అపహరించారు. క్రైం ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీకాంత్ కలిసి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. మన్మోహన్ తల్లిదండ్రులు గతనెల అమెరికాకు వెళ్ళగా అతను నగరంలోని అప్పా జంక్షన్ వద్ద ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నట్లు తెలిపారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మరో రెండు ఇళ్లలో తాళాలు పగులగొట్టి దొంగతానానికి యత్నించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్ఎఫ్సీ నగర్లో నెలలో నాలుగు సార్లు దొంగతనాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపించారు. మళ్లీ దొంగలు పడటంతో భయాందోళనలకు గురవుతున్నారు. భాదితుల ఫిర్యాదు ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.