మేడ్చల్, ఏప్రిల్ 14 : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్ మల్లన్న గుట్ట వద్ద ఉన్న క్వారీలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి నీటిలో గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన సూరజ్ (22) మేడ్చల్లోని అక్షర డిగ్రీ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం తన నలుగురు స్నేహితులతో కలిసి గిర్మాపూర్ మల్లన్న గుట్ట వద్ద ఉన్న క్వారీలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు.
క్వారీలో ఈత కొట్టేందుకు నీటిలోకి దిగిన సూరజ్ కాసేపటికే కనిపించకుండా పోవడంతో స్నేహితులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో మిగతా ముగ్గురు విద్యార్థులు సురక్షితంగా బయటపడగా.. సూరజ్ మాత్రం గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే మేడ్చల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన యువకుడి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.