Ramanthapur | రామంతాపూర్, మార్చి 28 : రామంతపూర్ డివిజన్లోని ఈస్ట్ శ్రీనివాసపురంలో అధికారుల నిర్లక్ష్యంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.25లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం కోసం రోడ్లను తవ్వేశారు. ఈ క్రమంలో డ్రైనేజీని బాగు చేయాల్సి ఉన్నా మరమ్మతు పనులు చేపట్టడం లేదు. డ్రైనేజీ పనులు పూర్తికాకపోవడంతో సీసీ రోడ్లను వేయడం లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి.
ఫలితంగా రోడ్లపై కంకర తేలి, పొంగుతున్న మురుగునీటితో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తే.. రేపు చేస్తాం.. ఎల్లుండి చేస్తామని దాటవేస్తున్నారే తప్ప పనులు మాత్రం చేయడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్ అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టం కనిపిస్తోంది. నెలరోజుల నుంచి తమ వాహనాలను రోడ్ల మీద పెట్టుకోవాల్సి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తక్షణమే కాలనీలో డ్రైనేజీని బాగు చేసి, సీసీ రోడ్లు వేయాలని కోరుతున్నారు.
Road2
డ్రైనేజీ బాగు చేస్తేనే.. రోడ్లు వేస్తాం : ఏఈ శ్వేత
ఈస్ట్ శ్రీనివాసపురంలో సీసీ రోడ్లు వేయలంటే డ్రైనేజీ బాగు చేయాలి. అందుకోసం సంబంధిత వాటర్ వర్క్స్ అధికారులకు చెప్పాం. త్వరలో ఆ పనులు పూర్తికాగానే సీసీ రోడ్లు వేస్తాం. వీలైనంత తొందరగా పనులు చేపట్టి రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.. ఏఈ శ్వేత