CPI Mahasabhalu | కుత్బుల్లాపూర్, ఆగస్టు 20 : రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక ఓటు హక్కును ప్రశ్నార్థకంగా మార్చిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ పొట్లూరి నాగేశ్వర్రావునగర్ భవన్లో సీపీఐ రాష్ట్ర నాల్గవ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముందస్తుగా షాపూర్‌నగర్‌లో కళానాట్యమండలి ఆధ్వర్యంలో డప్పుచప్పుళ్ల మధ్య ఎర్ర జెండాలను చేతపట్టుకొని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉత్సవ ర్యాలీని నిర్వహించారు.
అనంతరం మహారాజా గార్డెన్లో జరిగిన సభలో ముఖ్యఅతిధిగా హజరైన ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతీ ఒక్క వయోజనులకు ఓటుహక్కును కల్పించేలా చూడాల్సిన భారత ఎన్నికల సంఘం తటస్థంగా పని చేయడం లేదన్నారు. దీనికి కారణమైన బీజేపీని, ప్రధానమంత్రి మోదీని అధికారంలో నంుచి దింపేయాల్సిన సత్వర చర్య ఈ దేశ ప్రజలకు ఉందన్నారు.
ఇష్టం లేని ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించే కార్యక్రమం..
మోదీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగంపై దాడి పెరిగిందన్నారు. పార్లమెంట్‌ను పని చేయనివ్వడం లేదని, అది పని చేయకపోతే ప్రజాస్వామ్యం అంతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ చేస్తున్న చర్యల వల్ల బీహర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో పాలకులకు ఇష్టం లేని ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించే కార్యక్రమం చేస్తుందని విమర్శించారు. త్వరలో ఎన్నికలు జరిగే తమిళనాడు, కేరళ, బెంగాల్ రాష్ట్రాలలో ఎన్నికల కమిషన్ ఎలా పని చేస్తుందనేది పెద్ద సమస్యగా మారిందన్నారు. ఎన్నికల కమిషన్ ఎవరికి తొత్తుగా వ్యవహరించకుండా రాజ్యాంగ బద్ధంగా ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.
భారత్ హిందుత్వదేశం, మతతత్వరాజ్యంగా మారితే దేశానికే పెద్ద విపత్తుగా మారుతుందని రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ ఆనాడే హెచ్చరించినట్టు గుర్తుచేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలు దేశ చరిత్రలో ఎంతో కీలకమని ఈ ఎన్నిక రాజకీయ యుద్ధంగా మారాయన్నారు. దేశ ఉపరాష్ట్రపతి ధన్ కడ్ ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించారు.
ఈ రాజీనామాకు ఆయన అనారోగ్యం కారణం కాదని, అది కేవలం రాజకీయమే కారణమన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని ప్రకటించారని, అందుకు సీపీఐ కూడా ప్రత్యేక మద్దతు తెలుపుతుందని, లౌకికపార్టీలన్నీ మద్దతు తెలిపి దేశ రాజకీయ చరిత్రలో మలుపురాయి తిప్పాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సభలో సీపీఐ జాతీయ కార్యదర్శులు డా కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, సయ్యద్ అజీద్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, పశ్య పద్మ, పల్లా వెంకటరెడ్డి, కె.శ్రీనివాస్ రెడ్డి, తక్కెపల్లి శ్రీనివాసరావు, నెల్లికంటి సత్యం, జె చంద్రశేఖర్‌రావు, సౌహర్ధ, ఎండీ యూసుఫ్ పాటు జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండలాల కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.