ఘట్కేసర్ రూరల్, జూన్ 30 : పల్లె ప్రగతి కార్యక్రమం అమలుతో గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతాయని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ తెలిపారు. ఘట్కేసర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన పల్లె ప్రగతిపై అధికారు లు, ప్రజా ప్రతినిధులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నాలుగవ విడుత పల్లె ప్రగతిలో భాగంగా సంపూర్ణ పారిశుధ్య నిర్వహణ, హరితహారం మొక్కల పెంపకం, షెడ్ల నిర్మాణం, వైకుంఠధామాల నిర్మాణం, పల్లె ప్రకృతివనం ఏర్పాటు, సీజనల్ వ్యాధుల నియం త్రణ, కొవిడ్ వ్యాప్తి నియంత్రణ వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మ, ఎంపీడీవో అరుణ, మండల వ్యవసాయాధికారి ఎంఏ బాసిత్, మండల వైద్యాధికారి డాక్టర్ యాదగిరి, సభ్యులు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు, కార్యదర్శులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఘట్కేసర్, జూన్ 30 : గురువారం నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలు సిద్ధమయ్యాయి.ఈ మేరకు బుధవారం పోచారం మున్సిపాలిటీ పాలకవర్గం చైర్మన్ కొండల్‌రెడ్డి, ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పావనీ జంగయ్య యాదవ్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.పోచారం మున్సిపాలిటీలోని అభివృద్ధి పనులకు రూ.22 లక్షలు, ఘట్కేసర్లో పట్టణ ప్రగతి పనుల నిర్వహణకు రూ.13.65 లక్షలు కేటాయించారు.
గురువారం పోచారం మున్సిపాలిటీలో నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి మల్లారెడ్డి హాజరై ప్రారంభించనున్నట్లు చైర్మన్ కొండల్‌రెడ్డి తెలిపారు.
పీర్జాదిగూడ, జూన్ 30: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు మేయర్ జక్క వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కార్పొరేటర్లు, అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నేటి నుంచి చేపట్టనున్న పట్టణ ప్రగతి కార్యక్రమంపై అధికారులు దృష్టిసారించాలని సూచించారు. అభివృద్ధి పనులకు రూ.3.5 కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్‌గౌడ్, కార్పొరేటర్లు, కమిషనర్ బి.శ్రీనివాస్, డీఈ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్, జూన్ 30 : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీని అభివృద్ధికి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి అధికారులు, కౌన్సిలర్లకు సూచించారు. గురువారం నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానున్న దృష్ట్యా బుధవారం మున్సిపాలిటీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. కమిషనర్ అమరేందర్ రెడ్డి, మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు అమరం జైపాల్ రెడ్డి, డొడ్ల మల్లికార్జున్, బాలరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.