Aadhar Center | శామీర్‌పేట, ఫిబ్రవరి 7 : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని ఆలియాబాద్ గ్రామ ఉన్నత పాఠశాలలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతి రోజు ఆధార్ కేంద్రం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆధార కేంద్రం పని చేస్తుందని తెలిపారు. కొత్త ఆధార్ కార్డు కోసం, మార్పులు, చేర్పులకు ఇక నుంచి గ్రామస్తులు దూరంగా వెళ్లాల్సిన పని లేదని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు వారు సూచించారు.
ఘట్కేసర్, ఫిబ్రవరి 7 : ఘట్కేసర్ మున్సిపల్ మేనేజర్‌గా వేణుగోపాల్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఘట్కేసర్ మున్సిపల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించిన వెంకట్ రెడ్డి కమిషనర్‌గా పదోన్నతి పొంది బదిలీ కావడంతో ఆయన స్థానంలో అంకుశాపూర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ రెడ్డిని ఘట్కేసర్ మున్సిపల్ మేనేజర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు.
మేడ్చల్ కలెక్టరేట్, ఫిబ్రవరి 7 : అక్రమ నల్లా కనెక్షన్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జలమండలి నాగారం సెక్షన్ మేనేజర్ సాయికిరణ్ గౌడ్ హెచ్చరించారు. ఇప్పటికే అక్రమ కనెక్షన్లు కలిగి ఉన్న వారు, కొత్తగా పొందేందుకు ప్రయత్నిస్తే తనిఖీలు నిర్వహించి, చర్యలు తీసుకుంటామని అన్నారు. అక్రమ నల్లా కనెక్షన్ల కారణంగా అధికారికంగా నల్లా కనెక్షన్లు పొందిన వారికి తక్కువ నీళ్లు వస్తున్నాయని, ప్రెషర్ కూడా తక్కువ వస్తుందని పేర్కొన్నారు. నల్లా బిల్లులను ప్రజలు సకాలంలో చెల్లించాలని సూచించారు. తద్వారా మెరుగైన సరఫరాకు అవకాశం ఉంటుందని తెలిపారు. బిల్లుల చెల్లింపు, నీటి సరఫరాలో సమస్యలు ఉంటే నాగారం సెక్షన్ కార్యాలయానికి రావాలని, వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు.
శామీర్‌పేట, ఫిబ్రవరి 7 : తూంకుంట మున్సిపాలిటీని శుక్రవారం మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ రీజియయన్ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బయో మైనింగ్ పనులను పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పన్ను వసూళ్లపై ఆరా తీశారు. మార్చిలోపు 100 శాతం పన్ను వసూళ్లు సాధించాలని బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకట్ గోపాల్, డిప్యూటీ ఈఈ సునీత, మేనేజర్ శ్రావణ్‌కుమార్, ఈఈ కన్నేశ్వర్రావు, సిబ్బంది పాల్గొన్నారు.