ఘట్కేసర్,జూలై 3 : రాష్ట్రంలో కులవృత్తులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధి..నారపల్లి సురేందర్ రెడ్డి నగర్లో నిర్మించిన ఎక్సైజ్ శాఖ నూతన కార్యాలయాన్ని శనివారం మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రూ.3.70 కోట్ల మొక్కలు నాటామని,ఈ కార్యక్రమాన్ని సీఎం హరితహారంలో చేర్చారని తెలిపారు. ప్రతి గ్రామంలో ఈత, తాటి వనాలు ఉండాలని నిర్ణయించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్వచ్ఛమైన నీరా అందించాలని నీరా కేఫ్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలోని గీత వృత్తిదారుల కోసం ఎక్స్‌గ్రేషియా కింద రూ.13.40 కోట్లను టాయించామని, త్వరలో మంత్రి కేటీఆర్‌తో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన నీరా పథకంతో నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 2.50వేల మంది గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా వర్తింప జేయాలని శ్రీనివాస్ గౌడ్ పోరాడారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ , హైమద్, పోచారం చైర్మన్ కొండల్‌రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యానాయక్, తాసీల్దార్ విజయలక్ష్మి, కమిషనర్ సురేశ్, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, పీర్జాదిగూడ మేయర్ వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.