కేంద్ర ప్రభుత్వం రైతులపై కక్ష కట్టింది. పచ్చని పంట పొలాలను చూడగానే కడుపు మండిపోతున్నది. రైతులను నిండా ముంచేసి రోడ్డున పడేసే చర్యలకు పూనుకున్నది. దీన్ని ముందే పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం రైతులు మునుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తున్నది. స్వయంగా ముఖ్యమంత్రి రైతులకు విజ్ఞప్తి చేయగా.. వ్యవసాయ శాఖ అధికారులు సైతం ఊరువాడ తిరుగుతూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏ భూముల్లో ఏ పంట వేయవచ్చుననేది శాస్త్రవేత్తలు పరిశీలించి ఆయా పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో వరి పంట కంటే ఎక్కువ లాభాలు వచ్చే మెట్ట పంటల వైపు రైతులు దృష్టి సారిస్తున్నారు.
యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలి
వచ్చే యాసంగిలో వరికి బధులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వరిని మించి ఆదాయం వచ్చే పంటలను సాగు చేసి రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచిస్తున్నారు. వరి కోతలు త్వరలోనే ముగియనున్న నేపథ్యంలో యాసంగిలో వేసే పంటను రైతులు ఎంపిక చేసుకోవాలని కోరుతున్నారు.
వరికి ప్రత్యామ్నాయమైన పంటలను సాగుచేసేందుకు మేడ్చల్ జిల్లా భూములు అనుకూలంగా ఉన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్దారిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు రకాల (మధ్యస్థ, ఎర్ర, తేలికపాటి) స్వభావం గల భూములు ఉన్నాయని, ఇందులో పంటల మార్పిడి జరిగినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చని సూచిస్తున్నారు. ఈ భూముల్లో కూరగాయలు, పండ్లతోటలు, వేరుశనగ(పల్లీలు), పెసర్లు, మినుములు, పొద్దుతిరుగుడు, దనియాలు, నువ్వులు, ఆవాలు, రాగులు, కొర్రలు, వాము పంటలను సాగు చేసుకునే అవకాశం ఉన్నట్లు ఇటీవల ఇక్కడి భూములను పరిశీలించిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీటిద్వారా వరి కంటే రెట్టింపు ఆదాయం పొందవచ్చని చెప్పారు.
వరికి ప్రత్యామ్నయంగా సాగు చేసే పంటలకు విత్తనాలను అందుబాటులో ఉంచాం. మినుములు, వేరుశనగ (పల్లీలు), పెసర్లు, శనగ, పొద్దుతిరుగుడు విత్తనాలు రైతు సహకార సంఘాలలో సిద్ధంగా ఉన్నాయి. విత్తనాలకు ఎలాంటి కొరత లేదు. యాసంగిలో వేసే పంటలను రైతులు ఎంపిక చేసుకోవాలి. వరి కంటే రెట్టింపు ఆదాయం వచ్చే పంటలపై రైతులు దృష్టి సారించాలి. ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు.