మేడ్చల్, అక్టోబర్ 4: సత్ప్రవర్తనతో పని చేసిన వారు జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత శిఖరాలను చేరుకుంటారని స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యువర్ షిప్ రీజినల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. మేడ్చల్ ప్రభుత్వ ఐటీఐలో సోమవారం నిర్వహించిన జాతీయ అప్రెంటిస్ షిప్ మేళాను వెంకటేశ్వర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో అనేక కంపెనీలు ఉన్నాయని, అందుకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యత సాధించాలని సూచించారు. నైపుణ్యత గల విద్యార్థులను తయారు చేయడానికి ఐటీఐలు పని చేస్తున్నాయని తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి అప్రెంటిస్ షిప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మేళాను ఏర్పాటు చేశామని చెప్పారు. వచ్చిన అవకాశాలను జార విడువకుండా నమ్మకంతో పనిచేసి సత్తా చాటుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ మేళాలో మేడ్చల్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి హాజరైన 2,793 మంది విద్యార్థులకు 42 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూ నిర్వహించి 1,788 మంది విద్యార్థులను ఎంపిక చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ శైలజ, ట్రైనింగ్ అధికారి అహ్మద్, రామేశ్వర్, శ్యాంసుందర్, రేవంత్‌కుమార్, వివిధ కంపెనీల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.