కాప్రా, జూన్ 29- తెలంగాణలో నాయర్ సేవా సొసైటీని ప్రారంభించడం అభినందనీయమని గోవా గవర్నర్ శ్రీధరన్ పిౖళ్లె (Sreedharan Pillai) అన్నారు. కాప్రాలోని ఓ ఫంక్షన్‌హాలులో నాయర్ సేవా సొసైటీ ప్రారంభోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. నాయర్ సేవా సొసైటీని విర్చువల్‌గా ప్రారంభించిన తర్వాత గవర్నర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నాయర్ సొసైటీ ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. తెలంగాణలో కూడా నాయర్ సేవా సొసైటీ ప్రారంభించడం అభినందనీయమని గవర్నర్ అన్నారు.
నాయర్ సొసైటీని 1940 అక్టోబర్‌లో మున్నత్ పద్మనాభం ఏర్పాటు చేశారనీ ఎంపీ ప్రేమచంద్రన్ పేర్కొన్నారు. దేశంవ్యాప్తంగా ఉన్న నాయర్ కమ్యూనిటీని సంయుక్తపరిచి.. సొసైటీ ద్వారా కులమతాలకు అతీతంగా అందరికీసేవ చేయాలనే ఉద్దేశ్యంతో దీన్ని ప్రారంభించినట్టు వెల్లడించారు. నాయక్ సొసైటీ సంక్షేమం, అభివృద్ధి, అభ్యున్నతి సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఇక్కడ ఉన్న నాయర్లు భాగస్వామ్యం అవుతున్నారని ఎంపీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్ నుంచి కేరళకు వెళ్లేందుకు రైలు సౌకర్యాలు మరింతగా మెరుగు పర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు. అనంతరం నాయర్ సేవా సొసైటీ తాలూకా యూనియనన్ సభ్యులు కే. విజయచంద్రన్ ప్రసంగించారు. ఆద్యంతం కన్నులపండువగా జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ నాయర్ సొసైటీ పాలకసభ సభ్యులు, మలయాళీలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.