Suraram | దుండిగల్, ఫిబ్రవరి 22: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం కాలనీలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు పక్కన చెట్టును తొలగిస్తుండగా పైప్‌లైన్ పగిలి ఒక్కసారిగా వంట గ్యాస్ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతోందనని స్థానికులంతా ఆందోళనకు గురయ్యారు. కానీ హుటాహుటిన కంపెనీ సిబ్బంది చేరుకుని లీకేజీని అరికట్టడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సూరారంలోని మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రి సమీపంలోని బాలానగర్-నర్సాపూర్ ప్రధాన రహదారి ముందు ఓ చెట్టు మొదలును తొలగించేందుకు తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మీ గ్యాస్ లిమిటెడ్ సంస్థకు చెందిన వంట గ్యాస్ పైపులైన్‌కు చిల్లుపడింది. పైప్ లైన్‌కు రంధ్రం పడటంతో పెద్ద ఎత్తున గ్యాస్ లీకై ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందోనని భయపడిపోయారు.
వంట గ్యాస్ పైప్‌లైన్ పగిలిందన్న సమాచారం తెలియగానే భాగ్యలక్ష్మీ గ్యాస్ లిమిటెడ్‌కు చెందిన ప్రతినిధులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే మరమ్మతు పనులు చేపట్టారు. వీలైనంత తక్కువ సమయంలోనే లీకేజీని అరికట్టారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. సూరారం కాలనీ పరిసర ప్రాంతాల్లో తరచూ భాగ్యలక్ష్మీ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ నుంచి గ్యాస్ లీకవ్వడం పరిపాటిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భంలో గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు చేసినప్పుడు గుర్తింపు చిహ్నాలు పెడితే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని అంటున్నారు.