పీర్జాదిగూడ, సెప్టెంబర్ 6 : పెండ్లి చేసుకుంటానని నమ్మించి.. అనేకసార్లు లైంగికదాడికి పాల్పడి.. మోసం చేసిన పాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధి సాయి మారుతినగర్ కాలనీలో నివాసముంటున్న జోసెఫ్(35) ఉప్పల్‌లోని ఓ చర్చికి పాస్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2010లో ఓ యువతిని వివాహం చేసుకోగా, వీరికి పాప జన్మించింది. ఆమె చనిపోవడంతో 2015లో మరో యువతిని పెండ్లి చేసుకున్నాడు. కుమారుడు సంతానం. అయితే అదనపు కట్నం, కుటుంబ గొడవల కారణంగా ఆమె కొడుకును తీసుకొని వెళ్లిపోయింది. ఈ క్రమంలో జోసెఫ్‌కు చర్చిలో టెలీకాలర్‌గా పనిచేస్తున్న మరో యువతితో పరిచయం ఏర్పడింది. 2020 జనవరిలో ఓ కార్యక్రమం ఉందని ఆమెను కారులో తీసుకెళ్లి.. శంషాబాద్ సమీపంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అప్పటి నుంచి బాధితురాలిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి.. అనేకసార్లు లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో పెండ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేస్తుండటంతో ఈనెల 4న ఇంటికి వెళ్లి జోసెఫ్‌ను నిలదీయగా, వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో తనపై లైంగికదాడికి పాల్పడి మోసం చేశాడని బాధితురాలు జోసెఫ్‌పై మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరోవైపు రెండో భార్య సైతం తనను రూ.పది లక్షలు అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోమవారం పాస్టర్ జోసెఫ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.