కీసర, ఆగస్టు 31 : కీసర పీఎస్ పరిధిలో మూడు రోజుల కిందట జరిగిన ఓ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కీసర సీఐ జె.నరేందర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం మున్సిపల్ పరిధి ఆర్ఎల్నగర్లోని లక్కీ వైన్స్ వద్ద ఈనెల 28న గొడవ జరిగిన ఘటనలో దమ్మాయిగూడలోని రాజీవ్‌గృహకల్ప కాలనీలో నివాసముండే డ్రైవర్ కొయడ నరేశ్ (36) మృతి చెందాడు. తన భర్తను హత్య చేశారని మృతుడి భార్య హేమలత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు 28న లక్కీ వైన్స్ పర్మిట్ రూంలో నరేశ్‌తో పాటు అతడి సోదరుడు వేణు, స్నేహితులు అశోక్, శౌకత్‌అలీ మద్యం సేవించారు.
అదే సమయంలో ఘట్కేసర్ మండలం ఇస్మాయిల్‌ఖాన్‌గూడకు చెందిన ఈగ శివకుమార్ (29), బుగ్గి సత్యనారాయణ(40), యాద్గార్పల్లికి చెందిన కందుల సాయిబాబా (30) పక్క బెంచీలో కూర్చొని మద్యం సేవించారు. మద్యం మత్తులో వీరిమధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో శివకుమార్, సాయిబాబా, సత్యనారాయణ కలిసి నరేశ్‌తో గొడవకు దిగి, కాలర్ పట్టుకొని బలంగా కొట్టారు. ఈ ఘటనలో నరేశ్‌కు బలమైన గాయాలవ్వడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. నరేశ్ మరణానికి కారకులుగా శివకుమార్, సాయిబాబా, సత్యనారాయణను గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. విచారణంలో ముగ్గురు నేరం ఒప్పుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.